
కరీంనగర్, జూన్4,
మున్సిపల్ ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనున్న నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో విలీన గ్రామాలకు సంబంధించి డివిజన్లు, వార్డుల పునర్విభజనకు రాష్ట్ర సర్కారు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 3న డివిజన్ల విభజనకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంటుంది 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు, నివేదికలు స్వీకరించాలి. 12 నుంచి 16 వరకు అభ్యంతరాలను పరిశీలించాల్సి ఉంటుంది. 17, 18 తేదీల్లో డివిజన్ల విభజన పత్రాలకు కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. 19న ముసాయిదా జాబితాను సీడీఎంఎకు పంపించాలి. 20న సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదికను పంపించి, 21న ఫైనల్ డివిజన్ల జాబితాను విడుదల చేస్తారు.కరీం‘నగరం’ సమీపంలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మల్కాపూర్, చింతకుంట, గోపాల్‌పూర్, దుర్శేడ్, బొమ్మకల్ గ్రామాలను కలుపుతూ ప్రస్తుతం ఉన్న 60 డివిజన్లను 66కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నగరపాలక అధికారులు 66 డివిజన్లకు సంబంధించి గతంలోని ఓటరు జాబితాను అనుసరించి డివిజన్ల విభజనను పూర్తి చేసి సీడీఎంఏకు పంపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఒక జాబితా కూడా గతంలోనే సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టింది. అప్పటి నుంచే కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల నాయకుల్లో డివిజన్ల విభజనపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది.ఎవరికివారే తమ డివిజన్ల విభజన ఎలా జరిగింది? ఏయే కాలనీల ఓట్లు ఏయే ప్రాంతాల్లో కలిపారన్న చర్చలు సాగాయి. ప్రతి డివిజన్‌కు 4500 నుంచి 5500 ఓటర్లు ఉండేలా అధికారులు డివిజన్లను విభజించినట్లు తెలుస్తుండగా, అయితే పలు డివిజన్లల్లో దూర ప్రాంతాలకు చెందిన ఇండ్లను చేర్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి ఫిర్యాదులు, తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు సిద్ధమయ్యారు.