
హైదరాబాద్, జూన్ 5,
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనమని చాలామంది భావిస్తారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అవినీతి, నాణ్యతా లోపాలకు నిలయంగా ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అని గులాబీ నేతలు అంటుంటే, ఇది మొత్తం అవినీతిమయం అని హస్తం నేతలు విమర్శిస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని, డిజైన్‌లో తప్పులున్నాయని, అంచనాలు పెంచేశారని, భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం మార్చి 2024లో ఒక జుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిషన్‌గా ఏర్పాటు చేయబడిన దీనికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాన ఆరోపణలు
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, పంపుహౌస్‌లు మునిగిపోవడం వంటి సంఘటనలు ప్రాజెక్టు డిజైన్‌లో, నిర్మాణంలో తీవ్రమైన లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రారంభంలో వేల కోట్ల రూపాయలు ఉండగా, అది లక్ష కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇందులో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి.
నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలుఉన్నాయని, తక్కువ నాణ్యత కలిగిన సామగ్రిని ఉపయోగించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇందులో ముఖ్య నేతలకు లబ్ధి చేకూరిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ పాత్రపై విచారణ
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఆయనే స్వయంగా ఈ ప్రాజెక్టును ఒక ఇంజినీర్‌గా రూపొందించారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం సహా అన్ని విషయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించారన్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావన. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అంచనాల పెంపు, నిధుల్లో అవినీతి వంటి వాటిపై విచారణ జరిపేందుకు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని మొదట నోటీసుల్లో పేర్కొంది. అయితే, కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కమిషన్ విచారణ తేదీని జూన్ 11కు మార్చింది. ప్రాజెక్టు రూపకల్పన దశ నుండి ప్రాజెక్టు ప్రారంభం వరకు జరిగిన అన్ని అంశాలపై కేసీఆర్‌ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్ణయాలు, పర్యవేక్షణ వంటి అంశాల్లో ఆయన పాత్రపై ఆరా తీయనుంది.తెలంగాణ ఏర్పడిన తొలి ప్రభుత్వంలో హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ పనుల పర్యవేక్షణ, అంచనాల పెంపు, పర్యవేక్షణ లోపాలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక గల కారణాలు, నిధుల్లో అవకతవకల ఆరోపణలు వంటి అంశాలపై కాళేశ్వరం కమిషన్ విచారణ జరపనుంది. జూన్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు అమలులో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర, ఆయన నిర్ణయాలు, బాధ్యతలపై కమిషన్ దృష్టి సారించనుంది.కేసీఆర్ తొలి కేబినెట్‌లో ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, వ్యయ అంచనాలు, ఆర్థిక శాఖ అనుమతుల జారీ, నిధుల పంపిణీ, బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక అవకతవకలపై ఆరోపణలు వంటి అంశాలపై విచారణకు ఈటల రాజేందర్‌ను కమిషన్ ప్రశ్నించనుంది. జూన్ 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ విచారణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు కావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది.