YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరంగల్ మహాకాళి ఆలయానికి మహర్దశ

వరంగల్ మహాకాళి ఆలయానికి మహర్దశ

వరంగల్, జూన్ 5, 
వరంగల్‌లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయాన్ని గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇందులో భాగంగా రూ.20 కోట్లతో ఆలయానికి నాలుగు వైపులా రాజగోపురాలు నిర్మిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బుధవారం భద్రకాళి వేద విద్యాలయం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వెల్లడించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామని, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు. కొత్తగా 14 ఆలయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇప్పటికే రూ.30 కోట్లతో భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాదాయశాఖ స్థలంలో ఆలయ సంబంధిత పనులు చేపడుతుంటే అభ్యంతరాలు తెలపడం సరికాదన్నారు. అంతకుముందు, ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.వరంగల్ నగరానికి వాయువ్య దిశలో ఉన్న భద్రకాళి దేవాలయం కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన పురాతన, శక్తివంతమైన ఆలయాల్లో ఒకటి. సుమారు 625 ADలో చాళుక్యులచే నిర్మించబడి ఆ తర్వాత కాకతీయ చక్రవర్తులు దీనిని పునరుద్ధరించారని చరిత్రకారులు పేర్కొంటారు. ఈ ఆలయంలో కొలువైన భద్రకాళి అమ్మవారు ఉగ్రరూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహం అద్భుతమైన శిల్పకళతో చెక్కబడిన ఏకశిలారూపం. ఆలయం పక్కన ఉన్న భద్రకాళి చెరువు ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఈ చెరువు కాకతీయుల కాలంలో వ్యవసాయానికి, తాగునీటికి ప్రధాన వనరుగా ఉండేది. ఈ ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. దేవీ శరన్నవరాత్రులు, దసరా వంటి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి అమ్మావారి ఆశీస్సులు పొందుతారు. ప్రధాని మోదీ సహా.. పలువురు ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం కాకతీయ వైభవాన్ని, నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.

Related Posts