
గుంటూరు, జూన్ 16,
బాపట్ల జిల్లాలోని చీరాలకు ప్రత్యేకమైన. "కుప్పడం పట్టు చీరల'కు జాతీయ అవార్డు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జులై నెల 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగునుందని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. చీరాల కుప్పడం పట్టు చీరకు ప్రకటించిన జాతీయ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళిఅందుకోనున్నారుసంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్‌లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరాల పట్టు వస్త్రాల వ్యాపారుల్లో ఆనందం నెలకొంది.చీరాలలో మాత్రమే దొరికే కుప్పడం పట్టు వస్త్రాలకు తనదైన ప్రత్యేకత ఉంది. వీటిని మగ్గాలపై మాత్రమే నేస్తారు. ఎంతో నాణ్యతగా కలర్ ఫుల్ గా ఉండే కుప్పడం పట్టు చీరలు లైట్ వెయిట్ గా ఉంటాయి. అందుకే వీటిని ధరించడానికి మహిళలు ఉత్సాహపడుతుంటారు. అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉండే ఉప్పాడ, ధర్మవరం లాంటి పట్టు వస్త్రాలతో పోలిస్తే కుప్పడం పట్టుకు ఇంతవరకు పాపులర్ కి అంతగా లభించలేదు. దానికోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. జనవరి 9న జరిగిన కేంద్ర బృంద పర్యటనలో ప్రత్యేకంగా కొప్పడం పట్టు వస్త్రాలతో ఒక చిన్న సైజు ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో కుప్పడం పట్టు వ్యాపారస్తులు రకరకాల చీరలను ప్రదర్శించారు. కుప్పడం పట్టు క్వాలిటీ స్పెషాలిటీలతో సంతృప్తి చెందిన కేంద్ర బృందం ఇప్పుడు జాతీయ అవార్డుకు కుప్పం పట్టును సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా కుప్పడం పట్టు పాపులారిటీకి ఈ అవార్డు దోహదపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆనందం వ్యక్తం చేశారు.