YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అందుబాటులోకి మిర్చి విత్తనాలు

అందుబాటులోకి మిర్చి విత్తనాలు

గుంటూరు, జూన్ 16, 
 ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ లాం ఫారంలో జూన్ నెల 16  వ తేది (సోమవారం) నుంచి ఎల్.సి ఎ–625, ఎల్.సి ఎ–657, ఎల్.సి.ఎ-643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్మనున్నట్లు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ తెలియజేశారు. ఎల్. సి ఎ–643 రకం: పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైన రకము. కాయలు లేత ఆకుపచ్చ రంగులో పొడవుగా (13-14 సెం.మీ) ఆకర్షణీయంగా ఉంటాయి.  కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకం వలె ఉంటాయి. బాగా బెట్టను తట్టుకొంటుంది, కొంతవరకు జెమిని వైరస్ ను కూడా తట్టుకొంటుంది. అంతే కాక నల్లతామర పురుగు ఉద్ధృతి ఉన్న కూడా కొద్ధి పాటి పురుగు మందుల పిచికారితో, అధిక దిగుబడినివ్వ కలిగిన రకము.  ఎల్.సి ఎ–625 రకం: ఎండు మిరపకు అనువైన ఈ రకం, మొక్కలు బలిస్టమైన కొమ్మలతో ఎత్తుగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా ఉండి, కాపు చిక్కగా ఉంటుంది. ప్రధాన పొలంలో నేరుగా ఎద పెట్టడానికి మిక్కిలి అనువైన రకం. కాయలు సన్నగా, మధ్యస్థ పొడవుతో (8-10 సెం. మీ ) ఉంటాయి. తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చి కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాలలో కెల్లా అధిక ఘాటు (45000–50000 ఎస్.హెచ్.యు) మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60-65 ఎ.ఎస్.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొని, తాలు కాయలు చాలా తక్కువుగా వస్తాయి.ఎల్. సి ఎ–657 రకం: తొలకరి తరువాత నేరుగా ఎద పెట్టుకోవడానికి అనువైన జెమిని వైరస్ ను తట్టుకునే రకం. మొక్కలు ఎత్తుగా, దృఢమైన కాండంతో నిటారైన కొమ్మలు కలిగి, బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. కాయలు పొడవుగా (11-12 సెం.మీ), ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండినప్పుడు ముదురు ఎరుపు రంగుతో తెల్లటి తొడిమ కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు అధిక ఘాటు (50,000-55,000 ఎస్.హెచ్.యు), మంచి రంగును కలిగి ఉంటాయి. అధిక బెట్టను తట్టుకునే రకం.      విత్తనాలు కొనదలచిన రైతులు నేరుగా ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ లాం ఫారంలో, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు  విత్తనాలు అందిస్తారు. అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే పంపిణీ చేస్తారు. రెండో శనివారం, ప్రతి ఆదివారం పంపిణీకి సెలవు ప్రకటించారు. కిలో విత్తనాల ధర 1,200 రూపాయలుగా నిర్దారించారు.  ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ మాట్లాడుతూ, పైన తెలియజేసిన మిరప విత్తనాలు కేవలం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం, లాం ఫారం నందు మాత్రమే పొందగలరని, అవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపినట్లైతే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.  దీని కోసం 99898 09554  / 9440592982 ఫోన్ నెంబర్లను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు.
 

Related Posts