YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అక్కా, చెల్లెళ్ల మధ్య పెరిగిన దూరం

అక్కా, చెల్లెళ్ల మధ్య పెరిగిన దూరం

కర్నూలు, జూన్ 17, 
ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఆ అక్కచెల్లెళ్ళ మధ్య ఏదో జరుగుతోందా? ఇబ్బంది వచ్చినప్పుడు కూడా కనీసం ఒకర్ని ఒకరు పరామర్శించుకోలేనంత అగాధం పెరిగిపోయిందా? సినిమా, రాజకీయం కలగలిసిపోయినట్టుగా ఉండే ఆ సిస్టర్స్ ఎవరు? వాళ్ళ మధ్య సఖ్యత లేదన్న అనుమానాలు ఇప్పుడెందుకు వచ్చాయి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుముడతాయో… లేక ఆమే వివాదాలను వెతుక్కుంటూ వెళ్తారో తెలీదుగానీ… ఎప్పుడూ ఏదోఒక వివాదాస్పద టాపిక్‌తో చర్చల్లో వుంటున్నారు ఆమె. ఆ పరంపరలోనే… తాజాగా వివాదం ఆమె ఖాతాలో పడింది. కాకుంటే… ఈసారి ఇది మరింత తీవ్రమైనది, రక్త సంబంధానికి సంబంధించినదని చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళారు అఖిల. అక్కడే… అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయారామె. గోవిందిన్నెలో మూలపెద్దమ్మ దేవర గండ దీపం మోశాక స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే. ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు వరకు అన్ని పరీక్షలు చేయించుకొని ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జ్‌ అయ్యారామె. అటు మూల పెద్దమ్మ దేవర ఉత్సవాలకు అఖిలప్రియ సొంత చెల్లెలు మౌనిక, ఆమె భర్త మంచు మనోజ్ కూడా వచ్చారు. అఖిల పెదనాన్న భూమా బ్రహ్మనంద రెడ్డి ఆహ్వానం మేరకు వాళ్ళు కూడా ఉత్సవాలకు హాజరయ్యారట. కానీ… బ్రహ్మానంద రెడ్డి ఇంటికి అఖిలప్రియ వెళ్ళలేదు. అది వేరే సంగతి. ఇక అఖిల స్పృహ తప్పి పడిపోయిన సమయంలో మౌనిక దంపతులు కూడా అదే ఊళ్ళో ఉన్నారట. కానీ… వాళ్ళు అదేమీ పట్టించుకోకుండా… అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్లిపోయారు. అఖిల స్పృహ తప్పి పడిపోయి ఒక రోజంతా ఆసుపత్రిలో వున్నా… సొంత చెల్లి దంపతులు పరామర్శించక పోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అఖిలను మంత్రి ఫరూక్, ఇతర ముఖ్య నేతలు, ఆళ్లగడ్డ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అయినాసరే…. ఘటన జరిగినప్పుడు అక్కడికి దగ్గర్లోనే ఉన్న సొంత చెల్లి మౌనిక పరామర్శించకపోవడం ఏంటన్నది ప్రస్తుతం నంద్యాల పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్ క్వశ్చన్‌.ఆ మధ్య జరిగిన దివంగత భూమా శోభానాగిరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మౌనిక, మంచు మనోజ్ వెళ్లిన సందర్భంలోనూ అక్కచెల్లెళ్ళ మధ్య మాటలు లేవు. కేవలం భూమా ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించి అటు నుంచి ఆటే వెళ్లిపోయారు మౌనిక దంపతులు. అప్పుడు అఖిలప్రియ ఇంటికి వెళ్ళలేదట. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే భూమా ఘాట్‌కు వెళ్లి అఖిలను కలవకుండానే మౌనిక దంపతులు వెళ్లిపోయారు. వాటన్నిటిని ఇప్పుడు జరిగిన తాజా ఎపిసోడ్‌తో పోల్చి చూసుకుంటున్నవాళ్ళు…. భూమా సిస్టర్స్‌ మధ్య సత్సంబంధాలు లేవా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. కొన్నేళ్లుగా ఇద్దరూ కలిసిన సందర్భాలు కూడా లేవట. దీంతో గ్యాప్ గట్టిగా ఉందనే ప్రచారం ఊపందుకుంది. వాస్తవంగా… భూమా కుటుంబానికి సంబంధించి ఇది వ్యక్తిగత విషయమే అయినా… రాజకీయ, సినీ రంగంతో ఉన్న సంబంధాల కారణంగా చర్చనీయాంశం అవుతోంది. అటు తనను పరామర్శించకుండానే మౌనిక, మనోజ్ దంపతులు వెళ్లిపోవడంపై అఖిలప్రియ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. నేను కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్ లో ఉంటే… ఆ విషయం వదిలేసి పరామర్శలకు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదని మాట్లాడుకోవడం కరెక్ట్‌ కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారామె. అంతవరకు ఓకే అనుకున్నా…. చెల్లెలు తర్వాత ఫోన్లో అయినా పరామర్శించిందా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు ఎమ్మెల్యే. ఈ విషయంలో మౌనిక వైపు వాదన మరోలా ఉందట. అఖిల ఆసుత్రిలో చేరే సమయానికి తాము అక్కడి నుంచి వచ్చేశామని, ఆమె పడిపోయిన విషయం తమకు తెలియదని మంచు మనోజ్ వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నట్టు సమాచారం. మొత్తమ్మీద ఎమ్మెల్యే భూమా అఖిల అనారోగ్యం ప్రస్తుతం పొలిటికల్‌ కలర్‌ పులుముకుంటోంది. అక్క చెల్లెళ్ళ మధ్య ఏదో ఉందని ఊహాగానాలు పెరుగుతున్న క్రమంలో అలాంటిదేం లేదని ఇద్దరూ ఖండించకపోవడాన్ని ప్రత్యేకంగానే చూడాలంటున్నారు.

Related Posts