
తిరుపతి, జూన్ 18,
ఏపీ లిక్కర్ కేసులో ఏం జరుగుతోంది? ఇప్పటివరకు అధికారులపై దృష్టి పెట్టిన సిట్.. ఇప్పుడు నేతలపై గురిపెట్టారా? ఈ క్రమంలో చెవిరెడ్డిని అరెస్టు చేశారా? రేపో మాపో వైసీపీ కీలక నేతలు అరెస్టు కానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ కేసు కేవలం అధికారుల మాత్రమే నడిపించారని నిన్నటివరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టు కావడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. అసలు లిక్కర్ కేసుకు ఈయనకున్న లింకేంటని ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి తీసుకున్న నగదులో కొంత భాగాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నింటికి తానై వ్యవహరించారట ఆయన. ఏ క్షణమైనా సిట్ తనను అరెస్టు చేస్తుందని భావించిన ఆయన, శ్రీలంకకు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. చివరకు బెంగుళూరులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం, ఆ విషయాన్ని ఏపీ పోలీసులకు తెలపడం, సిట్ టీమ్ బెంగుళూరు వెళ్లి చెవిరెడ్డిని అరెస్టు చేయడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.. అంతకుముందు ఈ కేసులో కీలకంగా ఉన్న నేతలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకపోతే ఈ విషయం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు దర్యాప్తు అధికారులు.వైసీపీ హయంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి కలెక్ట్ చేసిన నగదును రాజ్ కసిరెడ్డి అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేసేవారు. చెవిరెడ్డి చెప్పడంతో ఆయన సిబ్బంది హైదరాబాదు, బెంగళూరులోని పలు ప్రాంతాలకు వెళ్లి ఆ సొమ్మును తీసుకొచ్చేవారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు మొత్తం 250 నుంచి 300 కోట్ల వరకు చెవిరెడ్డి చేతికి చేరాయని సిట్ భావిస్తోంది. చెవిరెడ్డికి చేరిన సొమ్మును ఐదు జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. ఆ నగదును వారు ఓటర్లకు పంపిణీ చేసి ప్రభావితం చేశారు. ఆ నగదు వ్యవహారాన్ని తరలించడం దాచడం చేసింది వెంకటేష్ నాయుడు అని' సిట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ఏ 34, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ 38, రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఏ 39 సహా మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చింది సిట్. ఈ మేరకు కోర్టులో మంగళవారం మెమో దాఖలు చేశారు. ఏ 35 బాలాజీ యాదవ్ చెవిరెడ్డికి ప్రధానా అనుచరుడు. గతంలో అతడు తుడాలో పనిచేశాడు. ఏ 36 నవీన్ రెడ్డి చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు. రాజ్ కసిరెడ్డి నుంచి సొమ్మును చెవిరెడ్డికి చేరవేయడంలో ఇతడికిలకంగా వ్యవహరించాడు. ఏ 37 గా ఉన్న హరీష్ చెవిరెడ్డి డ్రైవర్. నవీన్ తో పాటు వెళ్లి రాజ్ కసిరెడ్డి నుంచి నగదు తీసుకొచ్చాడు అని సిట్ అధికారులు తెలిపారు. చెవిరెడ్డి అరెస్టుతో ఈ కుంభకోణంలో అరెస్టయిన నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. రేపో మాపో మరో ఇద్దర్ని అరెస్టు చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మద్యం కేసులో నుంచి తన పాత్ర బయట పడగానే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాస్టర్ ప్లాన్ చేశారు. దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులపై బురద జల్లడం, విచారణ ముందుకు వెళ్లకుండా ఆటంకం కలిగించడం చేస్తూనే ఉన్నారు. తనవద్ద గన్‌మన్‌గా పని చేసిన హెడ్‌కానిస్టేబుల్ మదన్‌రెడ్డి, కీలక అనుచరుడు బాలాజీ యాదవ్‌లతో అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేయించారు. చెవిరెడ్డి పీఏ, గన్‌మెన్, డ్రైవర్లు, ఇతరులను విచారణకు పిలవడంతో తాను ఇరుక్కుపోయానని భావించారు చెవిరెడ్డి. అధికారులకు కీలక ఆధారాలు దక్కడంతో అరెస్టు తప్పదని భావించారు చెవిరెడ్డి. చివరకు విదేశాలకు పారిపోయేందుకు స్కెచ్ వేశారు. మూడో కంటికి తెలియకుండా శ్రీలంకకు టూర్ ప్లాన్ చేశారు. చివరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో చిక్కారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు. బెంగుళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డితో పాటు వెంకటేశ్ నాయుడిని అరెస్టు చేసిన సిట్ అధికారులు. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు…