
కడప, జూన్ 24,
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి. కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆ పార్టీ నేతలు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం కూటమిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వైసిపి కార్యకర్త మృతి రాజకీయ రంగు పులుముకుంది. జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొట్టి సింగయ్య మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. అందుకు సంబంధించి వీడియో ఒకటి బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు అయింది. ఆయనపై మోపిన సెక్షన్లు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. చాలా విషయాలపై చర్చించారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న నేతలతో చర్చలు జరిపారు. ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరపాలని నిర్ణయించారు. పల్నాడు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనల సందర్భంగా ఎదురైన పరిణామాల దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించారు ఏపీ పోలీసులు. కేవలం 11 వాహనాలతో కాన్వాయ్ గా వెళ్లాలని.. 100 మందితో విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవాలని సూచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి నుంచి 50 వాహనాలతో కాన్వాయ్ గా వెళ్లారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా జన సమీకరణ చేశారు. ఈ తరుణంలోనే సింగయ్య మృతి చెందడం సంచలనంగా మారింది. అందుకు సంబంధించి వీడియోలు సైతం బయటకు వచ్చాయి. అయితే ఆ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించినవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. పోలీసులు మాత్రం కఠిన సెక్షన్లు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కింద అరెస్టులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇది జీవిత ఖైదుకు సంబంధించిన సెక్షన్లు అని అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్యులు తాడేపల్లి కార్యాలయానికి హాజరుకావాలని సమాచారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని కూటమి ప్రభుత్వం పాలు కదుపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది. అందుకే జగన్ పునరాలోచనలో పడ్డారు. పార్టీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కుట్ర జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. జగన్ బయటకు వస్తుండడంతో జనాదరణ పెరిగిందని.. దానిని నియంత్రించేందుకే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు జూలై 8న వైయస్సార్ జన్మదినం. ఆరోజు ఇడుపాలపాయలో నివాళులు అర్పించేందుకు జగన్ వెళ్ళనున్నారు. అదే రోజు నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. అందుకే పార్టీ ముఖ్యులతో ముందుగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు ఏనాడో వెళ్లాల్సి ఉంది. సంక్రాంతి కంటే ముందే జిల్లాల పర్యటనకు సంబంధించి కీలక ప్రకటన చేశారు జగన్ మోహన్ రెడ్డి. కానీ జిల్లాల పర్యటనకు వెళ్లలేదు. ఆ విషయంలో కాలయాపన జరుగుతోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే జనాల ఆదరణ కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే మంచి ప్రయోజనం ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని నియంత్రించేందుకు అనేక రకాల కేసులను కూటమి తెరపైకి తెస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రజల మధ్యకు వెళితే వారి ఆదరణ తప్పకుండా లభిస్తుందని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే ఈనెల 25న జరగనున్న కీలక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.