
విశాఖపట్టణం, జూన్ 25,
విశాఖపట్టణం మధురవాడ పేరు వినిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా శాంతంగా ఉండే ఈ ప్రాంతం, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అక్కడ ఎలాంటి మలుపు తిరిగిందంటే.. పెద్ద ఎత్తున ఉద్యోగాలు, అంతర్జాతీయ కంపెనీ, కోటి రూపాయల పెట్టుబడులు అన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. ఇక్కడి యువతకు ఇదొక భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. విశాఖపట్నం జిల్లా మధురవాడ ప్రాంతంలోని సర్వే నంబర్లు 394, 395, 396, 397లలో ఉన్న మొత్తం 22.19 ఎకరాల భూమిని ఎకరానికి ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మామూలు భూమి కేటాయింపు కాదు దీని వెనక ఉంది భారీ స్థాయిలో ఐటీ పెట్టుబడి, లక్షల రూపాయల రాబడి, వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నది ప్రభుత్వ వాదన. ఈ భూమిని పొందబోతున్న సంస్థ పేరు కాగ్నిజెంట్ ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీ. విశాఖపట్నంలో వారు ఏర్పాటు చేయబోయే కేంద్రం ద్వారా రూ. 1582.98 కోట్లు విలువైన పెట్టుబడి రానుంది. ఇది ఎక్కడినుంచైనా ఒక మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టు ద్వారా 8000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఉద్యోగాలంటే కేవలం కంప్యూటర్ బేసిక్ జాబ్స్ అనుకోవద్దు.. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా అనలిస్టులు, టెక్నికల్ సపోర్ట్, మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో అవకాశాలు వస్తాయన్న మాట. అంటే విశాఖ, ఆంధ్రప్రదేశ్ యువతకు ఇది నేరుగా ఉపాధి అవకాశాలను దరికి చేర్చనుంది. ఈ ప్రాజెక్టును 2024-25 కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు భూమి, మౌలిక సదుపాయాలు, పన్ను సడలింపులు, విద్యుత్, నీటి సరఫరా వంటి అవసరాల్లో ప్రభుత్వ సహకారం లభిస్తుంది. అంటే ఇందులో ప్రభుత్వ రోల్ కేవలం భూమి ఇవ్వడమే కాదు, పూర్తి ప్రోత్సాహాన్ని అందించడమనే చెప్పాలి. ఈ ప్రతిపాదనకు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అర్ధం ఏంటంటే.. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ అధికారిక మద్దతుతో ప్రారంభం కాబోతోంది. ఇది విశాఖపట్నానికి, ముఖ్యంగా మధురవాడకు ఐటీ కేంద్రంగా రూపం తీసుకునే అవకాశం. ఇదే కాకుండా, కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు జోరుగా పెరుగుతాయి. ప్రైవేట్ స్కూల్స్, ట్రైనింగ్ సెంటర్లు, హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్, చిన్న వ్యాపారాలు ఇవన్నీ బాగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఇది కేవలం ఉద్యోగాలకే కాదు, ప్రాంత అభివృద్ధికీ బీజం వేస్తుందన్నమాట. ఈ ప్రకటనపై ఇప్పటికే విశాఖపట్నంలో యువతలో ఉత్సాహం కనిపిస్తోంది. మనం బెంగుళూరు వెళ్ళకుండా ఇక్కడే జాబ్ దొరకాలంటే ఇదే ఆరంభం అనే భావన కూడా కలుగుతోందని టాక్. ఐటీ స్టూడెంట్స్, ట్రైనింగ్ సెంటర్లు, ఇంజనీరింగ్ కాలేజీలు.. అందరూ ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలా అనే దిశగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో యువతను ఉద్యోగ రాహిత్యం నుండి బయటపడేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. IT, ITeS రంగాల్లో వందలాది కంపెనీలను ఆకర్షించేందుకు పలు మార్గసూచనలు, నూతన పాలసీలను తీసుకువస్తోంది. ఈ ప్రాజెక్ట్ వాటికి ఒక మైలురాయి అవుతుంది. మధురవాడలో మొదలైన ఈ ప్రయోగం కేవలం భూమి కేటాయింపు కాదని, అది రాష్ట్ర భవిష్యత్తు కోసం వేసిన బలమైన బాట అని చెప్పొచ్చు. వేల మందికి ఉద్యోగం, కోట్లాది పెట్టుబడి, ఐటీ రంగానికి కొత్త కేంద్రం అన్నీ కలిపి ఇది ఒక గేమ్ చేంజర్. ఇక మిగతా జిల్లాలు కూడా ఇదే దిశగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వ ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు.