YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అఖండ గోదావరికి శ్రీకారం

అఖండ గోదావరికి శ్రీకారం

రాజమండ్రి, జూన్ 25,
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26న ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఉదయం 10 గం.లకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
అఖండ గోదావరి ప్రాజెక్ట్ - ముఖ్యమైన వివరాలు
శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తారు.
ఏటా దాదాపు 15 -20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశముందని ఏపీ సర్కార్ అంచనా వేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి -2024-25 (స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్) స్కీమ్ ద్వారా దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి.
ఈ నిధులతో చారిత్రక నగరంగా పేరొందిన రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర గలిగి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన ప్రతిష్టాత్మక హేవలాక్ వంతెన పునర్నిర్మిస్తారు. చారిత్రక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలకు వేదికగా చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా 2.7 కి.మీ ల పొడవైన వంతెనపై 54 స్పాన్‌లు ఉన్నాయి. వీటిలో 25 స్పాన్‌లను అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
హేవలాక్ వంతెన ప్రాంతంలో ఒక్కో స్పాన్ క్రింద ఒక్కో థీమ్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు. అందులో రాజమహేంద్రవరం చరిత్ర, ఏపీ చరిత్రను తెలిపే స్పాన్ ఉంటుందన్నారు.
జలపాతాలు, గ్లాస్ వంతెనలు, గేమింగ్ జోన్, స్పేస్ థీమ్, అర్బన్ హాట్ క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హాలోగ్రామ్ జూ, టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, ఆక్వేరియం టన్నెల్ లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తారు.
ఈ థీమాటిక్ జోన్‌లకు ఆనుకుని సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను అందించేలా 10 బఫర్ స్పేస్‌లు ఏర్పాటు చేయనున్నారు.
18వ స్పాన్ అనంతరం 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రిడ్జిలంకలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తారు.
గోదావరి నది వెంట ఘాట్ లకు వెళ్లేలా బ్రిడ్జి లంక వద్ద బోటింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి దుర్గేశ్ తెలిపారు. గేమింగ్ జోన్ ఏర్పాటు చేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కల్పిస్తామన్నారు.
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ వంతెన పక్కనే ఉన్న పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు. అధ్యాత్మిక గమ్యస్థానంగా పుష్కర్ ఘాట్ ను తీర్చిదిద్దుతారు.
హేవలాక్ వంతెన, పుష్కర్ ఘాట్ రెండింటిని అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోన్న కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చి ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా వృద్ధి చేస్తామని మంత్రి దుర్గేశ్ తెలిపారు. కడియపులంక, పొట్టిలంక మరియు చుట్టుపక్కల నర్సరీల చుట్టూ పర్యావరణ అనుకూల పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.
శ్రీ కోట సత్తమ్మ దేవాలయాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా అదనపు యాత్రికుల వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ రాజగోపురం ఆధునికీకరించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు.
రాజమహేంద్రవరానికి జీవనాడి అయిన గోదావరి కాలువను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామన్నారు. గోదావరి హారతి ఘాట్ ను ఏర్పాటు చేయనున్నామన్నారు.
శాస్కి (స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్) స్కీమ్ ద్వారా రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి, రూ.75.91 కోట్లతో గండికోట ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు

Related Posts