
ఒంగోలు, జూన్ 25,
రాజకీయాల కోసం కుటుంబాలు అడ్డగోలుగా చీలిపోతుంటాయి. ఇది గతంలో చాలా సార్లు చూశాం కూడా. తాజాగా ఏపీలో సోదరుడు జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదిస్తున్నారు షర్మిల. తెలంగాణలో సైతం కేసీఆర్ కుమార్తే కవిత తన సోదరుడు కేటీఆర్ ను విభేదించినట్టు కనిపించారు. అయితే రాజకీయాలు అన్నాక కుటుంబాలు విభేదాలు రావడం సర్వసాధారణం. ఈ విషయంలో నందమూరి తారక రామారావు కుటుంబం చక్కటి ఉదాహరణ. ఎన్టీఆర్ అల్లుళ్ళు రాజకీయంగా చాలా విభేదించుకున్నారు. కానీ ఇప్పుడు అంతా కలిసి పోయారు. మొన్నటికి మొన్న తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణకు హాజరయ్యారు చంద్రబాబు. తమ మధ్య ఉన్న విభేదాలు గతం గతః అన్నట్టు విడిచి పెట్టేశారు. ఇప్పుడు తాజాగా నారా లోకేష్ సైతం దగ్గుబాటి కుటుంబంతో చట్టపట్టాలేసుకొని తిరుగుతుండడం విశేషం. తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు ఏర్పాటుచేసిన నూతన పాఠశాలను తన పెద్దమ్మ పురందేశ్వరి తో కలిసి ప్రారంభించారు నారా లోకేష్.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆ విషయంలో చంద్రబాబు కంటే ఆయనే సీనియర్. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు చంద్రబాబు. అప్పటివరకు ఉన్న కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి టిడిపిలోకి వచ్చారు. అంతకు ముందు నుంచే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పనిచేస్తూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఇద్దరి మధ్య గ్రూపులు నడిచేవి. కానీ 1995లో టిడిపి సంక్షోభ సమయంలో చంద్రబాబుకు అండగా నిలబడ్డారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. టిడిపిని స్వాధీనం చేసుకున్న తర్వాత.. చంద్రబాబు సీఎం అయ్యాక వారి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు.కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా, పురందేశ్వరి కేంద్రమంత్రిగా పనిచేశారు. అయితే 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పతనం అయింది. దీంతో పురందేశ్వరి బిజెపిలో చేరారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరమయ్యారు. క్రమేపి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. 2019 నుంచి 2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో ఈ రెండు కుటుంబాలు రాజకీయంగా ఇబ్బంది పడ్డాయి. దీంతో మరింత దగ్గరయ్యాయి. బిజెపిలో చేరిన పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. 2024 ఎన్నికల్లో అదే బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు వెనుక పురందేశ్వరి కృషి ఉందన్న టాక్ కూడా ఉంది. ఈ పరిణామ క్రమంలో రెండు కుటుంబాల మధ్య సయోధ్య పెరిగింది. దీంతో అంతా రాజకీయంగా కలిసి పనిచేసిన పరిస్థితి కనిపిస్తోంది.ప్రస్తుతం నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. త్వరలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం తథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో దగ్గుబాటి కుమారుడు హితేష్ చెంచురాం సైతం పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయన ఒక సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేశారు. ఆ స్కూల్ ను ప్రారంభించారు నారా లోకేష్. వచ్చే ఎన్నికల నాటికి చెంచు రామ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ద్వారానా.. లేకుంటే తెలుగుదేశం పార్టీ ద్వారానా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఆ కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తగ్గిపోయాయి. అయితే ఈ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ వ్యవహరించిన తీరు మాత్రం అదుర్స్.