
తిరుపతి, జూన్ 26,
రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో జనాభా ఆశించిన స్థాయిలో పెరగడం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. తాజాగా తొలి వెలుగు సభలో సైతం దీనిపై గట్టిగానే హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ మాదిరిగా ఏపీలో సైతం జనాభా పెరగాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికోసం గట్టిగానే కృషి చేస్తామని అన్నారు. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత విషయాన్ని ప్రస్తావించారు. జనాభా పెరుగుదలపై చంద్రబాబు మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల పలు వేదికలపై చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు దూరదృష్టితో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతోంది.గతంలో ఇద్దరు హద్దు.. ఒకరు ముద్దు అన్న నినాదంతో జనాభా నియంత్రణ సాగింది. ఇద్దరికంటే ఎక్కువగా పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లోపోటీకి అనర్హులని తేల్చారు కూడా. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనాభా ఎక్కువగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా జనాభా నియంత్రణ కావడంతో పిల్లలు యువత సంఖ్య తగ్గుముఖం పట్టింది. నడివయస్కులతో పాటు వృద్ధుల సంఖ్య పెరిగింది. దీంతో ఉద్యోగ ఉపాధి మార్గాలు తగ్గుముఖం పట్టాయి. వాటి ప్రభావం అభివృద్ధి పై పడింది. అందుకే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పిల్లలను కనాలని పిలుపునివ్వడం కూడా ఆశ్చర్యం వేసింది. అయితే జనాభా పెరుగుదలతో అభివృద్ధి ముడిపడి ఉన్నందున సీఎం హోదాలో ఆయన ఈ వ్యాఖ్యలు తరచూ చేస్తున్నారు.ఉత్తరాది రాష్ట్రాలైన బీహార ఉత్తరప్రదేశ్లో జనాభా సంఖ్య అధిక సంఖ్యలో ఉంది. అక్కడ ఉద్యోగంతో పాటు ఉపాధి మార్గాలు కూడా పెరిగాయి. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాజ్యాంగబద్ధ నిధులు కూడా అధికంగా ఆ రాష్ట్రాలకు వస్తున్నాయి. ఒక కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని తలసరి ఆదాయాన్ని లెక్కిస్తారు. అయితే ఈ విషయంలో ఆ రెండు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అందుకే చంద్రబాబు పదేపదే ఆ రెండు రాష్ట్రాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. వీలైనంతమందిని ఎక్కువగా కనాలని సూచిస్తుండడం విశేషం.మరోవైపు జనాభా పెరుగుదల కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకుగాను ఏపీ ప్రభుత్వం ఆ నిబంధనను తొలగించింది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును కూడా ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి కారణాలవల్ల ఏపీ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 2001లో ఏపీలో సంతాన ఉత్పత్తి సామర్థ్యం రేటు 2.6% గా ఉంది. ప్రస్తుతం అది 1.5 శాతానికి తగ్గిపోయింది. అందుకే చంద్రబాబు పదేపదే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీలో జనాభా పెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు, ప్రోత్సాహకాలు పెడుతున్నారు.