YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూడు పార్టీల్లోనూ... సమరోత్సాహం

మూడు పార్టీల్లోనూ... సమరోత్సాహం

హైదరాబాద్, జూన్ 26,
తెలంగాణలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి ఏడాది దాటింది. అయినా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. దీంతో కొందరు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కానీ నిర్వహించలేదు. మళ్లీ కోర్టుకు వెళ్లడంతో కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు రిజర్వేషన్లపై పార్టీల్లో, ఆశవహుల్లో ఉత్కంఠ నెలకొంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరుగుతాయి. దీంతో స్థానికంగా నమ్మకమైన, బలమైన నేతలకు పార్టీలు మద్దతు ఇస్తాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ సమరానికి సై అంటున్నాయి. అధికార పార్టీ హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీంతో ఎన్నిల్లో పైచేయి సాధించేందుకు మూడు పార్టీలు యతినస్తున్నాయి. పార్టీల గుర్తుపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నాయి. మెజారిటీ మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు దక్కించుకోవాలని ప్రణాళిక రూపొందిస్తున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ మినహా ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. మహిళలకు రూ.2,500 అందడం లేదు. పింఛన్లు పెరగలేదు. ఇక రైతుభరోసా గత యాసంగి, వానాకాలం కొద్దిమందికే అందింది. ఈ ఖరీఫ్‌లో దాదాపు అందరికీ పెట్టుబడి అందించారు. ఇక రైతు కూలీలకు కూడా ఏటా రూ.12 వేల సాయం కొద్ది మందికే అందుతోంది. దీంతో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇవి ప్రభావం చూసే అవకాశం ఉంది.ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు పదేళ్ల పాలన అనుభవం, గత పాలనలో అందించిన సంక్షేమ పథకాలు ప్లస్‌ పాయింట్‌. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌కు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన క్యాడర్‌ ఉంది. దీంతో స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. అయితే ఆ పార్టీలో ఇటీవలి పరిణామాలు, నేతల మధ్య ఐక్యత లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.ఇక మరో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పట్టు లేదు. ఉత్తర తెలంగాణలోని కరీనంగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో మాత్రంమే కాస్త పట్టు ఉంది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీకి పెద్దగా బలం, క్యాడర్‌ లేవు. అయితే ఇదే సమయంలో పట్టణాల్లో బీజేపీకి యూత్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. యువ ఓటర్లు, హిందువులు బీజేపీ వెంటే ఉంటున్నారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ఈసారి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లోనూ గతంకన్నా మెరుగైన ఫలితాలు సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ గణన చేపట్టింది. దీని ఆధారంగా వార్డుల విభజన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రణాళిక రూపొందిస్తోంది. అయితే ఈ అంశం కేంద్రం పరిధిలో ఉంటుంది. మరోవైపు రిజర్వేషన్లపై కోర్టులో కేసు ఉంది. ఈ తరుణంలో వార్డుల విభజనకు ఆటంకం కలుగనుంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు నిర్దేశిత రిజర్వేషన్లు సరైన రీతిలో అమలు కావడం ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం లభించనుంది.తెలంగాణ హైకోర్టు తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలను వేగవంతం చేయడమే కాక, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను సకాలంలో అమలు చేయడం ద్వారా స్థానిక పాలనా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రక్రియ సమర్థవంతంగా, పారదర్శకంగా జరిగితే, తెలంగాణలో స్థానిక సంస్థలు మరింత శక్తివంతంగా పనిచేసే అవకాశం ఉంది.

Related Posts