
ఒంగోలు, జూలై 3,
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకు వచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకు రావాలన్న ఆయన ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చడం లేదని తెలిసింది. కానీ బాలినేని ఆలోచన వేరే విధంగా ఉందని అంటున్నారు. అందుకోసమే ఆయన మౌనంగా ఉన్నారని సమాచారం. బాలినేని శ్రీనివాసులు రెడ్డి జనసేనలోనే ఉండి వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. బాలినేని శ్రీనివాసులు రెడ్డి తిరిగి వైసీపీలో చేరేందుకు మాత్రం సుముఖంగా లేరు జనసేనలోనే ఉండి తిరిగి ఒంగోలు నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారట. బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే ప్రకాశం జిల్లాను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఉన్నారు. నాడు పీసీసీ చీఫ్ గా, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన చెప్పిందే మాట.. చేసిందే శాసనం అన్నట్లు ఉండేది. నాటి నుంచి 2019 ఎన్నికల వరకూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వారికే టిక్కెట్లు దక్కేవి. అందుకే బాలినేని అందరు నేతలతో టచ్ లో ఉంటారు. వారు కూడా బాలినేని ప్రాపకం కోసం పాకులాడేవారు. అలాంటిది 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని వైసీపీకి రాజీనామా చేయడం, తర్వాత జనసేనలో చేరిపోవడం ఆశ్చర్యానికి గురి చేశాయి.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వ్ డ్ నియోజకవర్గాలు జనరల్ కు మారే అవకాశముంది. ప్రస్తుతం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్థన్ కు బాలినేని శ్రీనివాసులు రెడ్డికి మధ్య పొసగడం లేదు. బాలినేనిని దామచర్ల శత్రువుగానే చూస్తారు. ప్రత్యర్థిగానే పరిగణిస్తానని దామచర్లజనార్థన్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. జనసేనలో ఉన్న కీలక నేతలు కూడా దామచర్ల జనార్థన్ వెంట ఉన్నారు. దామచర్ల జనార్థన్ సొంత ఊరు కొండపి నియోజకవర్గంలో ఉంది. కొండపి ప్రస్తుతం రిజర్వ్ డ్ నియోజకవర్గంగా ఉంది. అక్కడ మంత్రి స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో దామచర్ల కుటుంబానికి మంచిపట్టుంది.నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొండపి జనరల్ కేటగిరీగా మారితే దామచర్ల జనార్థన్ ను తెలుగుదేశం పార్టీ అక్కడకు పంపే అవకాశముంది. దామచర్ల జనార్థన్ కూడా తనకు ఒంగోలు కంటే కొండపి నియోజకవర్గం సేఫ్ అని ఖచ్చితంగా భావిస్తారని బాలినేని లెక్కలు వేసుకుంటున్నారు. అప్పుడు తాను ఒంగోలు నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని బాలినేని శ్రీనివాసులు రెడ్డి భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి సైలెంట్ గాఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాన్ నుంచి సంకేతాలు రావడంతో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు అప్పుడప్పుడు వచ్చి తన అనుచరులను కలసి చర్చించి వెళుతున్నారు.