
విశాఖపట్టణం, జూలై 3,
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని అర్థమవుతుంది. తమను అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని గట్టిగా విశ్వసిస్తున్నట్లుంది. కూటమి ధర్మాన్ని సక్రమంగా పాటించలేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతుంది. బీజేపీ నేతలు అసహనం బహిరంగ వేదికలపైన కూడా వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ అయిన నామినేటెడ్ పదవుల విషయంలోనూ బీజేపీకి అన్యాయం జరుగుతుందని, అదేమంటే తమను తక్కువ ఓటింగ్ శాతం ఉన్న పార్టీగా టీడీపీ పరిగణించడం ప్రధాన కారణంగా కమలం పార్టీ నేతలు చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ మద్దతు లేకపోతే గెలుపు సాధ్యమయ్యేదా? అన్నది పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం తమ పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలు, నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా బలం లేదన్న సాకుతో తమకు ఒకటి అరా పోస్టులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక ముఖ్యమైన నిర్ణయాల్లో కూడా తమ పాత్ర లేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. కూటమిలో కేవలం టీడీపీ, జనసేన లు మాత్రమే డామినేట్ చేస్తున్నాయని, తమను అస్సలు మిత్రపక్షంగా కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని భావిస్తున్నారు. నేతలు బహిరంగ వేదికలపై బరస్ట్ అవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ ఓటు బ్యాంకు ఐదు శాతం ఉందని అనడమేంటని, ఇది దారుణమని అన్నారు. బీజేపీ కనుక కూటమిలో ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు కూటమిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనేలా చేశాయి. వచ్చే ఏడాది కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని అందులో బీజేపీకి ఐదు శాతం కేటాయిస్తామని చెబితే కుదరదని తేల్చిచెప్పారు. దశాబ్దాలుగా కష్టపడుతున్న నాయకులకు సీటు విషయంలో ఎగనామం పెట్టడం కుదరదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఇది కూటమి పార్టీలో చర్చనీయాంశమైంది.