
నెల్లూరు, జూలై 3,
వైసీపీ యూత్ వింగ్ మీటింగ్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేపట్టబోతున్నానని, అప్పుడు అందర్నీ ప్రత్యేకంగా కలుస్తానన్నారు. యూత్ వింగ్ నేతల అంతిమ లక్ష్యం ఎమ్మెల్యే కావడం అని ఉద్బోధించారు. జనంలోకి వెళ్లి, జనంతో మమేకమై స్థానికంగా బలపడాలన్నారు, సోషల్ మీడియాని వాడుకోవాలన్నారు. ఒకరకంగా ఇటీవల కాలంలో జగన్ పెట్టిన అన్ని మీటింగుల్లోకి ఇదే కాస్త ఆసక్తికరంగా ఉంది. మిగతా నేతలతో మొక్కుబడిగా మాట్లాడి ముగించిన జగన్, యువ నేతలతో మాత్రం పార్టీ భవిష్యత్ ప్రణాళికలు వివరించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీనియర్లకు చెక్ పెడతారనే భావన కలిగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుదలకు మంచి అవకాశం ఉంటుందని యువనేతలకు చెప్పారు జగన్. “ఎదగడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది” అని వారిలో ధీమా కల్పించారు. గతంలో తాను పార్టీ పెట్టినప్పుడు అందరూ కొత్తవాళ్లే ఉన్నారని, తనని నమ్మి తనతో నడిచినవారంతా ఉప ఎన్నికల్లో గెలిచారన్నారు జగన్. సీనియర్లకు చెక్.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీనియర్ నేతల ప్రవర్తన ఒకలా ఉంది, అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది సైలెంట్ అయ్యారు. పెద్దిరెడ్డి, పేర్ని నాని, అంబటి వంటి ఒకరిద్దరు నేతలు మాత్రం హడావిడి చేస్తున్నారు. మిగతా చాలామంది నేతలు నియోజకవర్గాల్లో ఉండి కూడా, ప్రజల వద్దకు వెళ్లడం లేదు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా లేరు. వారి వ్యవహార శైలి జగన్ కు నచ్చడం లేదని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు సీనియర్లకు పెద్దపీట వేసినా, ప్రస్తుతం వారు పార్టీకోసం ఉపయోగపడటం లేదు అని డిసైడ్ అయ్యారు జగన్. అందుకే పార్టీకి కొత్త రక్తం ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. తొలి అడుగు యూత్ అధ్యక్షుడిగా వేయాలని, చివరి అడుగు ఎమ్మెల్యే కావడం అని చెప్పారు జగన్. వైయస్ఆర్ సీపీలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా మొదటి అడుగు వేయండి.. ఎమ్మెల్యేగా పార్టీలో మీ చివరి అడుగు పడుతుంది టార్గెట్ 2029. టీడీపీలో కూడా సీనియర్లకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. మంత్రి మండలి కూర్పులో సీనియర్లతో పాటు, యువనేతలకు కూడా పెద్దపీట వేశారు సీఎం చంద్రబాబు. ఒకరకంగా యువ నాయకులను తనతో కలుపుకొని వెళ్తున్నారు లోకేష్. వైసీపీలో ఆ పరిస్థితి ఇప్పటి వరకు లేదు. సీనియర్లతోనే జగన్ మాట్లాడుతున్నారు, వారితోనే మీటింగ్ లు పెడుతున్నారు, వారికే అన్ని బాధ్యతలు అప్పగించారు. కానీ ఇటీవల ఆయన వైఖరి మారినట్టుంది. సీనియర్లకు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయిన జగన్, యువ నాయకత్వానికి తాజా మీటింగ్ లో భరోసా ఇచ్చారు. ఈరోజు యువనాయకులంతా రేపటి ఎమ్మెల్యేలు అంటూ వారిలో ఆశ కల్పించారు. 2029లో గట్టి పోటీ ఇవ్వాలంటే సీనియర్లు సరిపోరని, యువ నాయకత్వంతోనే ఆ పని అవుతుందని గ్రహించారు జగన్. సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించే లోపు, యువ నాయకులు సోషల్ మీడియాలో హడావిడి చేయగలరు. ఆ తేడాని సరిగ్గా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు జగన్. మరి యువ నాయకత్వంలో కూడా వారసులకే అవకాశాలు ఉంటాయా, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకున్నవారిని పార్టీలో ఎదగనిస్తారా అనేది వేచి చూడాలి