
వరంగల్, జూలై 3,
ములుగు జిల్లాలో కొలువుదీరిన మేడారం సమ్మక్క, సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇక్కడ జరుగుతుంది. తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి ఈ మహా జాతర నిర్వహిస్తారు. అయితే వచ్చే ఏడాది(2026)లో నిర్వహించే మహా జాతరకు సంబంధించి పూజారులు కీలక ప్రకటన విడుదల చేశారు. జాతర తేదీలను ప్రకటించారు.
2026 జనవరి 28 బుధవారం సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు. గోవింద రాజు, పగిడిద్ద రాజులు గద్దెలకు చేరుకుంటారు.
2026 జనవరి 29 గురువారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు.
2026 జనవరి 30 శుక్రవారం భక్తులు తమ మొక్కుబడులను సమర్పించుకునే ప్రత్యేక దినంగా ఉంటుంది.
2026 జనవరి 31 శనివారం సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లు వనప్రవేశం తో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుందని పూజారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఈ మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం.. పగిడిద్దరాజను తీసుకురావడం. పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. జాతరలో పగిడిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో జాతరకు ఒకరోజు ముందు పగిడిద్దరాజును పెళ్లికొడుకును చేస్తారు. ఆ తర్వాత మరునాడు ఆలయానికి చేరుకొని, బలి, ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పగిడిద్ద రాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు.పగిడిద్దరాజును తీసుకొచ్చిన విషయాన్ని.. సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం.. ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తర్వాత.. పగిడిద్ద రాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరినీ ఎదురుదెరుగా కూర్చొబెట్టి.. వాయనం ఇచ్చిపుచ్చుకుని.. వివాహం పూర్తి చేస్తారు. పగిడిద్ద రాజును సారలమ్మ గద్దెల వద్దకు తీసుకుని పోతారు.అదే రోజు సారలమ్మకు కన్నేపల్లిలో ఉదయమే రెండు మూడు గంటలపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడ నుంచి మేడారం తీసుకువస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజు ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం.. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకువస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి గద్దెలపైకి చేరుకుంటారు.ఆ తర్వాత చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకుని వస్తారు. అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం, ఎదురుకోళ్ల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపై నారచెట్టుకింద ఉన్న కుంకుమ భరిణె రూపంలోని సమ్మక్క ఉంటుంది. ఆమెను కుంకుమ భరిణే రూపంలో పూజారులు తీసుకొస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్టిస్తారు. మేడారం జాతర మెుత్తానికి ఇదే కీలక ఘట్టం.ఈ తంతు తర్వాత ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువై మూడో రోజు భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చివరి రోజున దేవతలను మళ్లీ వనంలోకి పంపిస్తారు. దేవతలు.. వనప్రవేశం చేయడంతో.. మేడారం మహాజాతర పరిపూర్ణం అవుతుంది.ఈ మేడారం జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. జాతర తేదీలు ఖరారైన తర్వాత… ప్రభుత్వాధికారులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నిర్వహణ కార్యక్రమాలపై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి… పకడ్బందీ ఏర్పాట్లు చేస్తారు. జంపన్న వాగుతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తుల కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా శానిటేషన్ కోసం భారీగా సిబ్బందిని రంగంలోకి దించుతారు.భక్తుల రాకపోకల కోసం కూడా భారీగా ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతారు. హైదరాబాద్, వరంగల్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు బస్ స్టేషన్ల నుంచి ఈ జాతరకు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేస్తారు.