
హైదరాబాద్ జూలై 8,
సినీ సెలబ్రిటీలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లు గా వ్యవహరించి చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే ఆయన శ్రీ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం, కానీ ఆ సంస్థ మనీ లాండరింగ్ కేసులో చిక్కుకోవడంతో ఈడీ అధికారులు మహేష్ బాబు ని విచారణకు హాజరు కావాలని ఆదేశించడం వంటివి జరగడం మనమంతా చూసాము. అయితే మహేష్ బాబు విచారణకు హాజరు అయ్యాడో లేదో, అసలు ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళింది అనేది ఎవరికీ తెలియదు. ఈ అంశాన్ని అందరూ మర్చిపోయారు కూడా. కానీ ఇంతలోపే మరో రియల్ ఎస్టేట్ కుంభకోణం లో మహేష్ బాబు చిక్కుకున్నాడు. అయితే సాయి సూర్య డెవలపర్స్ సంస్థ మహేష్ బాబు యాడ్స్ ని ప్రచారం చేయడం వల్ల రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మహిళ ఒక లే అవుట్ లో ఫ్లాట్స్ ని కొనుగోలు చేసిందటఒక్కో ఫ్లాట్ కి 34 లక్షల రూపాయలకు పైగా డబ్బులు తీసుకున్నారని, తీరా చూస్తే కొన్న ఫ్లాట్స్ మా పేరు మీద రిజిస్టర్ చేయడానికి అనుమతించలేదని ఆమె ఆరోపించింది. దీంతో కట్టిన డబ్బులను వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేయడంతో సాయిసూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్తా ఆమెకి కేవలం 15 లక్షలు మాత్రమే చెల్లించారట. మిగిలిన డబ్బుల కోసం అడిగితే అసలు అందుబాటులోకి రాలేదని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె రంగారెడ్డి కన్సూమర్ ఫోరమ్ లో ఫిర్యాదు చేసింది. ఆమె పిటీషన్ ని క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరమ్ అధికారులు సతీష్ గుప్త తో పాటు, ఆ యాడ్ ని ప్రమోట్ చేసిన మహేష్ బాబు కి నోటీసులు జారీ చేశారు. జులై 8న మీ న్యాయవాదులతో పాటు ఫోరమ్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.మరి మహేష్ బాబు ఈసారైనా విచారణకు హాజరు అవుతాడా?,లేక కేవలం తన న్యాయవాదులను పంపి సరిపెడుతాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ అంశంపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మహేష్ బాబు పై తీవ్రమైన ట్రోల్స్ వేస్తున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్ని చేసావు బాబు అంటూ ఆయన్ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మహేష్ బాబు కానీ, ఆయన టీం కానీ రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా రెండు ప్రధానమైన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం అప్పుడే పాతిక శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుందట. ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారట మేకర్స్.