
కరీంనగర్, జూలై 8
లేకలేక మంత్రి పదవి వచ్చింది. కానీ మంత్రి పదవి స్వీకరించిన కొన్ని రోజులకే నాకు ఇలాంటి శాఖలు కేటాయిస్తే ఏం చేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వాకిటి శ్రీహరి. గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదని.. నాశనం అయిన శాఖలను కేటాయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కేటాయించిన శాఖలపై కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత పదేళ్లలో పూర్తిగా నాశనం అయిన శాఖలను తనకు అప్పగించారని అన్నారు. యువజన సర్వీసులు, పశుసంవర్థక శాఖలు ఇస్తే నేనేం చేసుకోవాలి. గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి అంటూ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కేటాయించిన మొత్తం శాఖలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, తన అదృష్టమో లేక దురదృష్టమో అర్థం కావడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాకిటి శ్రీహరి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినా అదృష్టం వరించింది. తెలంగాణ కేబినెట్ మంత్రి అయ్యారు. సామాజిక సమీకరణం కలిసి రావడంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తొలి ప్రయత్నంలోనే మంత్రి పదవితో జాక్ పాట్ కొట్టారు. మేజర్ పంచాయత్ మక్తల్ సర్పంచ్ గా విజయం సాధించిన వాకిటి శ్రీహరి అంచెలంచెలుగా ఎదిగి గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ ఎమ్మెల్యే అయ్యారు. ముదిరాజ్ లకు కేబినెట్ లో బెర్త్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ కావడంతో రాష్ట్ర మంత్రి అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా చేసిన వాకిటి శ్రీహరి ZPTC మక్తల్ గా తెలంగాణలో రెండో అత్యధిక మెజార్టీ తెచ్చుకున్నారు. తరువాత మహబూబ్ నగర్ జిల్లా జిల్లా పరిషత్ లో కాంగ్రెస్ పార్టీ ZP ఫ్లోర్ లీడర్ గా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేట్ ఎన్నికలలో ఇంఛార్జ్ గా చేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొంది, తొలి ప్రయత్నంలోనే మంత్రి అయ్యారు. కానీ తనకు కేటాయించిన శాఖలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.