
హైదరాబాద్, జూలై 8,
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపు కోసం అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మూడు పార్టీలకూ ఉపఎన్నిక అత్యంత కీలకమే. ఎవరు గెలిస్తే వారికి ప్రజామోదం లభిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఆరు నూరైనా జూబ్లిహిల్స్‌లో గెలవాలన్న పట్టుదలగా అన్ని పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లిహిల్స్ ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ఇది ఆ పార్టీకి సిట్టింగ్ సీటు. ఇప్పటికే సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ ను ఆ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు జూబిహిల్స్ కోల్పోతే .. ఇప్పటికే ఆ పార్టీ పరిస్థితి డెడ్ అయిందని అది మరోసారి నిరూపితం అయిందని కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేయడం ప్రారంభిస్తారు. అందుకే జూబ్లిహిల్స్ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. మాగంటి గోపీనాథ్ మొదట తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న ఆయన.. 2014లో పోటీ చేసే అవకాశాన్ని పొందారు. విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరో రెండు సార్లు గెలిచారు. అయితే ఈ రెండు సార్లు గెలుపులో ఆయనకు టీడీపీ సానుభూతిపరుల సపోర్టు బాగా ఉపయోగపడింది. అయితే మజ్లిస్ పార్టీ మద్దతు కూడా ఉపయోగపడింది. మాగంటి గోపీనాథ్ కోసం.. టీడీపీ సానుభూతిపరులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఉంటారని. ఈ సారి ఎవరు అభ్యర్థి అయినా బీఆర్ఎస్ కు ఓటు వేయరన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో మజ్లిస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరం అయింది. ఈ క్రమంలో టీడీపీ మద్దుత కోసం కేసీఆర్ ప్రయత్నించారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో లోకేష్ హాజరయినప్పుడు.. కేటీఆర్ కూడా వెళ్లారని.. అక్కడ అర గంట సేపు చర్చలు జరిపారని అంటున్నారు. మొత్తం రెండు సార్లు సమావేశం జరిగిందని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ కుటంబసభ్యులకే టిక్కెట్ ఇస్తామని.. టీడీపీ తరపున సహకరించాలని కోరినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఖండించడం కూడా చేయలేదు. ఈ అంశంపై స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. అయితే అంతర్గతంగా మాత్రం.. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ ప్రభావం ఏమి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి ఎంత మద్దతు ఉంటుదో వైసీపీకీ అంతే ఉంటుందని తమ పార్టీకి ఎప్పుడూ వైసీపీ మద్దతుగానే ఉంటుందని గుర్తు చేస్తున్నారు. లోకేష్ ను మద్దతు అడిగే పరిస్థితి రాదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఇంకా స్పందించలేదు.