
హైదరాబాద్, జూలై 8,
తెలంగాణ కాంగ్రెస్ కు నిజంగా ఇది అగ్ని పరీక్ష. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ కు అనివార్యంగా ఉండాలి. లేకపోతే పార్టీ నాయకత్వంపై అసంతృప్తులు మరింత పెరుగుతాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆరు నెలల్లోనే జరుగుతుంది. మాగంటి గోపీనాధ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే గతంలో సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే ఉప ఎన్నికలో ఏకగ్రీవం కావడం సంప్రదాయంగా వస్తుంది. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత అది తెలంగాణలో కనిపించడ లేదు. 2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పోటీ చేశాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేశ్ విజయం సాధించారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ మూడు పార్టీలూ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఎటూ ఆ పార్టీ తమ అభ్యర్థిని బరిలో దింపుతుంది. అలాగే బీజేపీ కూడా ఖచ్చితంగా తన పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి దింపుతుంది. ఇక కాంగ్రెస్ కూడా అధికారంలో ఉండటంతో ఖచ్చితంగా తన అభ్యర్థిని గెలిపించుకునే దిశగా ప్రయత్నిస్తుంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంపన్నులు ఎక్కువగా ఉన్నట్లే పేద, మధ్య తరగతి ప్రజలు కూడా ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గంలో గెలుపోటములను అంచనా వేయలేం. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఈ నియోజకవర్గ ప్రజలు వెళ్లే అవకాశాలున్నాయి.కొనసాగుతున్న సహాయక చర్యలు మైనారిటీలూ ఎక్కువే... జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైనారిటీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ మైనారిటీ వర్గాలే కాకుండా ఉన్నతస్థాయి వర్గాల ప్రజలు కూడా అధికంగానే ఉండటం, కమ్మ, రెడ్డి సామాజికవర్గాలతో పాటు మిగిలిన కులాల వారు కూడా అధికంగా ఉండటంతో కాంగ్రెస్ తమకుకు అనుకూలం ఉంటుందని భావిస్తున్నారు. మరొక వైపు ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ కు పరోక్షంగా మిత్రపక్షంగా ఉంది. ఎంఐఎం సహకారం కనుక కాంగ్రెస్ నేరుగా తీసుకుంటే ఇక్కడ గెలుపు కాంగ్రెస్ కు నల్లేరు మీద నడకే అవుతుంది. అదే సమయంలో ఎంఐఎం కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే వీలుంది. ఎంఐఎం గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మద్దతుదారుగా ఉండటంతో ఆ ఓట్లు బీఆర్ఎస్ కు పోలయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ కు సపోర్టుగా ఉండటంతో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీని కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. మోదీ ప్రభావంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొంత పట్టు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్కక్షుడు మల్లికార్జున ఖర్గే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గెలవాలని ఆదేశించి వెళ్లారు. అదే సమయంలో ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ఇది రెఫరండంగా కూడా పార్టీ హైకమాండ్ చూసే అవకాశముంది. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో బేరీజు వేసుకునేందుకు పార్టీ అధినాయకత్వానికి ఒక అవకాశం దొరుకుతుంది. అందుకే రాష్ట్ర నాయకత్వానికి అంటే ఇటు పీసీసీ చీఫ్, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకసవాల్ అని చెప్పక తప్పదు.