YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు లో నేలబారు రాజకీయాలు

నెల్లూరు లో నేలబారు రాజకీయాలు

నెల్లూరు, జూలై 9, 
సింహపురి రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నెల్లూరు పాలిటిక్స్ మాత్రం ఇప్పుడు దాడులతో హీటెక్కాయి. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారు పేరు. గత కొన్ని దశాబ్దాలుగా అనేక మంది నెల్లూరు నుంచి రాజకీయాల్లో ఎదిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా దాడులు జరుగుతున్నాయి. నేతల మధ్య వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యం. గతంలో ఈ జిల్లా నుంచి ఆనం గోపాల్ రెడ్డి నుంచి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వరకూ ఎంతో హుందాగా రాజకీయాలు నడిచేవి. వ్యక్తిగత విమర్శలకు అసలు చోటుండేవికావు. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు సింహపురి రాజకీయాలను కూడా మార్చేస్తున్నాయి. హుందాగా రాజకీయాలు చేసిన నేతలు ఇప్పుడు చౌకబారు విమర్శలకు దిగుతున్నారు. అంతేకాదు.. రాజకీయ విమర్శలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఫలితంగా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. డబ్బు పుష్కలంగా ఉంది. అధికారం కూడా నెల్లూరు రెడ్లకు ఉంది. అయితే అన్నింటికీ మించి నెల్లూరు రెడ్లు రాజకీయాల్లో సంస్కారవంతంగా వ్యవహరిస్తారన్న పేరుంది. అలాంటి నెల్లూరు రాజకీయాలు నేడు నేలబారుకు చేరుకున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిల మధ్య వివాదం చోటు చేసుకుంది.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలను వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేశారు. దానికి కౌంటర్ ఇవ్వడంలో భాగంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార రెడ్డి కొంత ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత దుర్భాషలకు దిగారు. దీంతో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడులు జరిగాయి. ఇంట్లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. అయితే ఈ దాడులు వేమిరెడ్డి కుటుంబం మాత్రమే చేసిందని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. డబ్బు ఉందన్న అహంకారంతో దాడులకు పాల్పడుతున్నారని, తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదని, తాను ఆమెపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. ... అయితే నల్లపురెడ్డి ఇంటిపై దాడితో తమకు సంబంధం లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. దాడుల సంస్కృతి తమది కాదన్న ఆమె ప్రసన్నకుమార్ వల్ల చాలా మంది బాధపడ్డారన్నారు. వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చని ప్రశాంతిరెడ్డి చెప్పారు. ఆరోపణలు చేసిన వైసీపీ నేతలకు నాది ఒకటే ప్రశ్న అని, నల్లపురెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు మీ ఇంట్లో మహిళలకు చూపించాలని సవాల్ విసిరారు. నల్లపురెడ్డివ్యాఖ్యలను జగన్‌ సీరియస్‌గా తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. మొత్తం మీద సింహపురి రాజకీయాలు దాడుల సంస్కృతికి దిగడం ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Related Posts