
కర్నూలు, జూలై 9,
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్గపోరుతో టీడీపీ ఆగమాగం అవుతోందట. ఓవైపు.. ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ తీసుకెళుతున్న వేళ.. ఉమ్మడి జిల్లాలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయట. ఆత్మకూరు ఘటన మరవకముందే.. ఆలూరు తగాదా పెరిగి పెద్దదైంది. దీంతో.. జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది అన్న టెన్షన్ నెలకొందట తెలుగు తమ్ముళ్లలో. ఆలూరులో మూడు వర్గాలుగా తెలుగు తమ్ముళ్లు. ఆలూరులో తెలుగు తమ్ముళ్లు మూడు వర్గాలుగా విడిపోయారా అంటే అవునన్న వాదన బలంగా విన్పిస్తోంది. పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేపట్టినా తమ తమ వర్గాలుగా కొన్నింటిలో పాల్గొంటూ.. మరికొన్నింటిలో జాడ లేకుండా పోతున్నారట తెలుగుదేశం నాయకులు. అవును.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలూరు రాజకీయం ఎప్పుడూ హాట్‌హాట్‌గా, హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. నేతల మధ్య విభేదాలు, సహకారం అందించుకోకపోవడం ఇక్కడ సర్వ సాధారణంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు తమ్ముళ్ల మధ్య తెగని పంచాయితీలు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య పంచాయితీలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా గడప గడపకూ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకుంటున్నారు. అయితే.. ఇలాంటి కార్యక్రమం పక్కన పెట్టి జిల్లాలోని టీడీపీ నేతలు ఎవరికి వారే వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం అనే మాట విన్పిస్తోంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ దశలో బుడ్డా అనుచరులు ఏరాసు ఇంటిపై దాడికి దిగడంతో వర్గ పోరు తారస్థాయికి చేరింది. చివరకు చేసేదేమీ లేక జరిగిన ఘటనను మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారట ఎంపీ బైరెడ్డి శబరి. ఆలూరులోనూ రచ్చకెక్కిన వర్గపోరు. ఈ తగాదా మర్చిపోకముందే ఆలూరులోనూ ఇదే మాదిరిగా వర్గపోరు రచ్చకెక్కింది. ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో సుపరిపాలన కార్యక్రమాన్ని చేపట్టారు పార్టీ సీనియర్ నేత బస్తిపాటి నాగరాజ్. అయితే.. ఆలూరు ఇంఛార్జ్ వీరభద్ర గౌడ్ లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని సొంత పార్టీ నేతలే ప్రోగ్రాంను అడ్డుకోవడం వివాదాస్పదమైంది. చివరకు ఈ విభేదాలు మరింత ముదరడంతో పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించే నేతలపై చర్యలు ఉంటాయని చెబుతూ వీరభద్రగౌడ్‌పై వేటు వేసింది అధిష్టానం. ఆలూరు ఇంఛార్జ్‌గా ఆయన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇంఛార్జ్ ఒకరుంటే.. ఎమ్మెల్యే టికెట్ మరొకరికి. వాస్తవానికి ఆలూరులో టీడీపీ రాజకీయం ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ మూడు వర్గాలుగా పార్టీ కన్పిస్తుంది. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఒకరిని నియమించే పార్టీ అధిష్టానం.. ఎన్నికల నాటికి మరో వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుండడమే ఇందుకు కారణమని స్థానికంగా ఉండే లీడర్లు, కేడరే చెబుతుంటారు. ఈ అంశమే పార్టీకి.. నియోజకవర్గంలో పెద్ద మైనస్‌గా మారుతోందట. పార్టీకి ఇబ్బందిగా మారుతోందంటున్న తమ్ముళ్లు. కూటమి హవా బలంగా వీచిన 2024 ఎన్నికలనే తీసుకుంటే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల తమ్ముళ్లే విజయభేరి మోగించారు. కానీ, ఆలూరులో మాత్రం స్వల్ప మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విరూపాక్షి విజయం సాధించారు. ఇందుకు కారణం టీడీపీ అభ్యర్థిగా నాటి ఎన్నికల్లో పోటీ చేసిన విరభద్రగౌడ్‌కు మాజీ ఇంఛార్జ్‌ల నుంచి సరైన మద్దతు లేకపోవడమేనట. గతంలో నెలకొన్న పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే.. 2014 ఎన్నికలకు ముందు ఆలూరు ఇంఛార్జ్ బాధ్యతలు వైకుంఠం కుటుంబానికి అప్పగించింది పార్టీ అధిష్టానం. కానీ, తీరా ఎలక్షన్ల నాటికి వీరభద్రగౌడ్‌కు టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత. దీంతో.. వైకుంఠం ఫ్యామిలీ ఆ ఎన్నికల్లో వీరభద్ర గౌడ్‌కు సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత వీరభద్ర గౌడ్‌కు ఇంఛార్జ్ పదవి అప్పగించాక.. 2019లో కోట్ల సుజాతమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇక, కోట్ల సుజాతమ్మ ఇంఛార్జ్ అయిన తర్వాత 2024లో వీరభద్ర గౌడ్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. దీంతో.. ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇచ్చినా అప్పటి వరకు ఇంఛార్జ్‌గా ఉన్న వాళ్లు సహకరించకపోవడంతో సమస్యలు తప్పడం లేదట. ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రేసులో రెండు కుటుంబాలు నిలిచాయన్న ప్రచారం. తాజా పరిణామాలతో అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఎవరు ఉంటారో.. వారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని లేదంటే కేడర్‌లో విభేదాలు తలెత్తుతాయని చెబుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఎవరిని నియమిస్తారన్న టాక్ నడుస్తోంది. అయితే.. ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రేసులో ప్రస్తుతం రెండు కుటుంబాలు నిలిచాయన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి కోట్ల కుటుంబం అయితే.. మరోటి వైకుంఠం కుటుంబం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి గట్టి చరిత్రే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన కోట్ల సుజాతమ్మ ప్రజలతో, పార్టీ నేతలతో సత్సంబంధాలు మెయింటెన్ చేస్తూ తమ మార్కు రాజకీయాలను నడుపుతుంటారన్న పేరు తెచ్చుకున్నారు. ఇక, వైకుంఠం ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళా నేత జ్యోతి సైతం నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించారు. మరి.. వీరిద్దరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఈ రెండు కుటుంబాల నేతలను కాదని ఇంకెవరికైనా నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి అప్పగిస్తారా అన్న చర్చ సైతం నడుస్తోంది.