
తిరుపతి, జూలై 9,
సాహిత్యంతో పనిలేదు. రాగంతో అవసరం లేదు. పల్లవి ప్రస్తావన వద్దు. పదాలు సరదాగా ఉంటే చాలు. రాగం అదే పుట్టేస్తుంది. సాహిత్యం అదే వచ్చేస్తుంది. దాని తగ్గట్టుగా దరువు తోడైతే చాలు.. ఆ పాటను సోషల్ మీడియాలోకి ఎక్కిస్తే చాలు.. ట్రెండింగ్ లోకి వచ్చేసినట్టే. నేటి కాలంలో అటువంటి పాటలకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సరిగా నాలుగు నెలల క్రితం కోయా రే కోయా పాట ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి ఓ హీరో తన సినిమాలో ఈ పాటను పెట్టుకున్నారు. అంతకుముందు ఓ మతాన్ని ఆచరించే మహిళ.. తను ఆరాధించే దేవుడిని స్తుతిస్తూ పాడిన పాట.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా బోలెడు ఉంటుంది. ఫేమస్ అవ్వడానికే వారంతా ఇది చేస్తుంటారు. ఒకప్పుడు ఇటువంటి పాటలు ఉన్నప్పటికీ అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రకరకాల రూపాలలో అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ పాట కూడా ఇలాంటిదే.కొంతమంది మహిళల బృందం “చంద్రన్నా.. మాయన్నా” అనే పేరుతో ఓ పాటను పాడారు. ఆ పాట ఒక పల్లె పదానికి పేరడీ మాదిరిగా ఉంది.. ఒంటిపై ముడతలు పడ్డాయని.. రెండు కాళ్లు పోయి మూడో కాలు వచ్చిందని.. చూపు మందగించిందని.. శరీరం సత్తువ కోల్పోయిందని.. 50 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వచ్చేసిందని ఆ పాట పాడుతున్న మహిళలు పేర్కొన్నారు..సహజంగా ఈ పాటలో చంద్రన్న అనే ప్రస్తావన ఉండడంతో కొంతమంది కావాలని ఈ పాటను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. ఆ పాటను కావాలని ఓ పార్టీ నాయకులు ఈ స్థాయిలో విమర్శిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.. ఆ మహిళలు చంద్రన్న అనే పేరు ఒక రాజకీయ నాయకుడిని ఉద్దేశించి పాడలేదని.. కేవలం జనాలకు అర్థమవ్వడానికే పేరును ప్రస్తావించారని పేర్కొంటున్నారు. దానివల్ల జనాలకి ఈజీగా కనెక్ట్ అవుతుందని వారు భావించారు. కానీ కొంతమంది మాత్రం ఈ పాటకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. తమ రాజకీయ ప్రాబల్యం కోసం ఈ పాటను వక్ర భాష్యం చెబుతున్నారని నెటిజన్లు అంటున్నారు.ఆ మహిళలు ఓ భజన సంఘంలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వారి వ్యవహార శైలి.. ధరించిన దుస్తులు.. పెట్టుకున్న బొట్లు.. భజన సంఘాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తమ భజన సంఘం ద్వారా వారు ఈ పాటలు పాడే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. వారు సమాజాన్ని మేల్కొల్పే ఉద్దేశంతో పాటలు పాడితే.. కొంతమంది మాత్రం పనిగట్టుకొని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో వీక్షణలు సొంతం చేసుకుంటున్నది.