
ముంబై, జూలై 10,
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు ఏవి అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. అందులో సమాధానం రూపంలో వచ్చే పేర్లలో అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటివి ముందు వరుసలో ఉంటాయి. నిన్నటి వరకు ఈ సమాధానం సరైనదే. కానీ నేటినుంచి ఈ సమాధానం తప్పు. ఎందుకంటే ఈ కంపెనీలను పక్కనపెట్టి.. ఈ కంపెనీలు కలలో కూడా ఊహించని మార్జిన్ అందుకొని.. ఈ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ గా నిలిచింది ఈ కంపెనీ. రఫ్ గా చెప్పాలంటే ఈ కంపెనీ ముందు ఇంగ్లాండ్ జిడిపి కూడా తక్కువ. ఇంగ్లాండ్ మాత్రమే కాదు ఫ్రాన్స్, ఇటలీ, కెనడా జీడీపీలు కూడా తక్కువే. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటి? చరిత్ర? ఈ స్థాయిలో ఎలా ఎదిగింది? ఈ ప్రశ్నలకు సమాధాన రూపమే ఈ కథనం ఎన్విడియా కంపెనీ అమెరికా కేంద్రంగా కార్యకాలపాలు సాగిస్తుంది. 1993 లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రాంతంలో ఈ కంపెనీ ఏర్పాటయింది. ఈ సంస్థను జెన్ సెన్ హువాంగ్, క్రిస్ మాలోచివ్స్కి, కర్టీస్ ప్రీమ్ ఏర్పాటు చేశారు. బ్రైట్ కంప్యూటింగ్, డీప్ మ్యాప్, క్యుములస్ నెట్వర్క్, మెల్లనోస్ నోక్స్ వంటి విభాగాలలో ఈ సంస్థ సేవలు అందిస్తుంది. ఈ కంపెనీ షేర్లు బుధవారం నాడు తారాజువ్వలాగా మెరిశాయి. ప్రపంచంలోనే ఏకంగా నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సొంతం చేసుకున్నాయి. ఈ ఘనత అందుకున్న తొలి పబ్లిక్ కంపెనీగా ఈ సంస్థ నిలిచింది. వాల్ స్ట్రీట్ లో అత్యంత నమ్మకమైన స్టాక్ లలో ఒకటిగా తన స్థానాన్ని అత్యంత పటిష్టంగా మార్చుకుంది ఈ సంస్థ. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ చిప్ తయారీలో నిమగ్నమైంది. ప్రపంచంలోనే పేరెన్నికగల చిప్ లు తయారు చేస్తూ ప్రఖ్యాతిగాంచింది. ప్రస్తుత సాంకేతిక కాలంలో కృత్రిమ మేధకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కృత్రిమ మేధ లో చిప్ లను అనివార్యంగా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు 2.5 శాతం పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒక్కో షేర్ ముఖ విలువ 164 డాలర్లకు పెరగడం విశేషం. 2023లో ఈ కంపెనీ షేర్ల ముఖ విలువ 14 డాలర్లుగా ఉండేది.కృత్రిమ మేధకు గిరాకీ ఏర్పడటంతో ఈ కంపెనీ ముఖ విలువ పెరగడానికి దోహదం చేసింది. తద్వారా బిల్ గేట్స్, టీమ్ కుక్, జెఫ్ బెజోస్, లారీ పేజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలను ఈ సంస్థ అధిగమించింది. ఈ కంపెనీ విలువ ఇప్పుడు ఏకంగా నాలుగు ట్రిలియన్ డాలర్లకు పెరగడం విశేషం.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 600 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఈ కంపెనీ విలువ ఉండేది. ఇక ఇటీవలి త్రైమాసికంలో ఎన్విడియా కంపెనీ 19 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో మందకొడిగా ఉన్నప్పటికీ.. ఈ సంస్థ స్టాక్ ర్యాలీ ఇటీవల జోరుగా సాగింది.. చైనా కంపెనీ డీప్ సీక్ అభివృద్ధి చేసిన డిస్కౌంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఆవిర్భావం ఈ రంగానికి సంబంధించిన స్టాక్ లపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ బూమ్ నుంచి ఎన్విడియా మెరుగైన ప్రయోజనాలు పొందింది. అందువల్లే ఈ కంపెనీ స్టాక్స్ రికార్డు స్థాయిలో ధరను పలికాయి. ద్రవ్యోల్బణం, అమెరికా అధ్యక్షుడి సుంకాలు.. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఎన్విడియా మీద పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగింది. అందువల్లే ఈ కంపెనీ విలువ ఏకంగా నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరుకొంది.ఎన్విడియా కంపెనీ విలువ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో.. ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో జిడిపి పరంగా చూసుకుంటే నాలుగు ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న దేశాలు కేవలం ఐదు మాత్రమే. జిడిపి పరంగా 30.51 ట్రిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో, 19.23 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండవ స్థానంలో, 4.74 ట్రిలియన్ డాలర్లతో జర్మనీ మూడవ స్థానంలో, 4. 19 ట్రిలియన్ డాలర్లతో భారత్ నాలుగో స్థానంలో, 4.18 ట్రిలియన్ డాలర్లతో జపాన్ 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఆరవ స్థానంలో ఉన్న యునైటెడ్ కింగ్డమ్ జిడిపి 3.84 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 3.21, ఇటలీ 2.42, కెనడా 2.23, బ్రెజిల్ 2.13 ట్రిలియన్ డాలర్ల జిడిపి ని కలిగి ఉండడం విశేషం. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ దేశాల జిడిపి కంటే ఎన్విడియా కంపెనీ విలువ అధికంగా ఉండడం గమనార్హం.