
న్యూఢిల్లీ, జూలై 9,
ఢిల్లీలో పాత పెట్రోల్, డీజిల్ వాహనాలపై ప్రభుత్వం పెట్టిన ఆంక్షల వల్ల సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజుల్లో పాత కార్ల ధరలు 40 నుండి 50 శాతం వరకు తగ్గాయి. ఢిల్లీ ప్రభుత్వ నియమాలు, కోర్టు ఆదేశాల కారణంగా పాత వాహనాల అమ్మకాలపై చాలా ప్రభావం పడిందని అక్కడి వ్యాపారులు అంటున్నారు. రాజధానిలో సుమారు 60 లక్షల పాత వాహనాలు ఈ ఆంక్షల వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యాయని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనే పరిశ్రమ సంఘం పేర్కొంది. ఢిల్లీలో జూలై 1 నుంచి పాత వాహనాలపై నిషేధం అమల్లోకి రావాలి. అయితే, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్, పర్యావరణ మంత్రి ఇచ్చిన లేఖ తర్వాత ఈ నిషేధాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలపై నిషేధం పూర్తిగా రద్దు కాలేదు. ఈ నిర్ణయం తర్వాత కూడా సీజ్ చేసిన వాహనాల భవిష్యత్తుపై గందరగోళం కొనసాగుతోంది. ప్రభుత్వం కొద్దిగా ఊరటనిచ్చినా పాత వాహనాల యజమానులు, వ్యాపారులకు పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు.ఢిల్లీలో నిబంధనల ప్రకారం.. 15 ఏళ్లు నిండిన పెట్రోల్ కార్లను, 10 ఏళ్లు నిండిన డీజిల్ కార్లను నడపడానికి అనుమతి లేదు. కోర్టు ఆదేశాల తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఈ పాత వాహనాలకు ఇంధనం పోయడంపై కూడా నిషేధం విధించింది. అంటే, జూలై 1 నుంచి ఈ వాహనాలు రోడ్లపైకి రాకూడదు. అయితే, వ్యాపారులు, సామాన్య ప్రజలు దీనిపై నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ను ఈ ఆంక్షలను తొలగించమని కోరింది. అయినప్పటికీ వ్యాపారులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు తమ పాత కార్లను కేవలం పావు వంతు ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని అక్కడ వ్యాపారులు చెబుతున్నారు. ఉదాహరణకు, గతంలో రూ.6-7 లక్షలకు అమ్ముడైన లగ్జరీ సెకండ్ హ్యాండ్ కార్లు ఇప్పుడు రూ.4-5 లక్షలకు కూడా అమ్ముడుపోవడం కష్టంగా మారిందని తెలిపారు.పాత వాహనాలను సాధారణంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంటారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల కొనుగోలుదారులు కూడా బేరం ఆడుతున్నారు. ఎందుకంటే వారికి ఢిల్లీలో ఉన్న పరిస్థితి గురించి తెలుసు. కరమ్ బాగ్, ప్రీత్ విహార్, పీతంపుర, మోతీ నగర్ వంటి ప్రాంతాల్లో 1000 మందికి పైగా వ్యాపారులు సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారులకు భారీ నష్టాలు వస్తున్నాయి.
వ్యాపారులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీ నుంచి పాత వాహనాలను వేరే రాష్ట్రానికి ట్రాన్సఫర్ చేయాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. గతంలో ఈ ప్రక్రియ సులువుగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆలస్యం, టెక్నికల్ సమస్యలు పెరిగాయి. మొత్తం మీద, పాత వాహనాలపై పెట్టిన ఆంక్షలు ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి.