
హైదరాబాద్, జూలై 9,
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. బీఆర్ఎస్ నేతలు ఎన్నిలకు మూడేళ్ల ముందే రా రమ్మంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసురుతున్నారు. ప్రతి చిన్న విషయానికి సై అంటే సై అంటున్నారు. ఎన్నికలకు తెలంగాణలో ఇంకా మూడేళ్లు సమయం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సమరం కోసమే ఈరకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ తాము అమలుచేస్తున్న సంక్షేమపథకాలపై చర్చకుసిద్ధమని ప్రకటించారు. అయితే ఇందుకు తాము సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ కు వస్తున్నామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దమ్ముంటే పాలనచేయాలని, సంక్షేమాన్ని అమలు చేయాలని, లేకుంటే అధికారాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే పాలనఎలా చేయాలో చూపిస్తామని కేటీఆర్ అన్నారు. తాను చర్చకు సిద్ధమని ప్రెస్ క్లబ్ కు వస్తే తోకముడుచుకు పోయారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేస్తూ అబద్ధపు పాలన చేసే రేవంత్ రెడ్డికి అధికారంలో కొనసాగేందుకు అర్హత లేదని అన్నారు. ఏ వేదిక అయినా.. ఏ ప్లేస్ అయినా తాను చర్చకు రావడానికి సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ఢిల్లీకి తిరుగుతూ ముడుపులు అందిస్తూ పదవులను కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ప్రజా సంక్షేమాన్నిపక్కనపెట్టి పదవులను కాపాడుకోవడానికే కాలాన్నివెచ్చిస్తున్నారన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్ తన సోదరి కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫ్రస్టేషన్ లో ఉన్నారని, ముందు తన ఇంట్లో జరుగుతున్న సమస్యలను పరిష్కరించుకుని అప్పుడు చర్చకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ విసిరారు. అయ్య ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, ప్రతిపక్షనేతగా అసెంబ్లీకి కూడా రావడం లేదని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. తాము ఏ పాయింట్ పైనేనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. మొత్తం మీదస్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈరకమైన సవాళ్లు, ప్రతి సవాళ్లు తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎక్కువయ్యాయన్నది వాస్తవం.