
హైదరాబాద్, జూలై 9,
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ప్రాధమిక విచారణలో తేలింది. నిన్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం కూడా పరిశీలించి ఇదే రకమైన అనుమానాలను వ్యక్తం చేసింది. ఎన్ఎండీఏ బృందం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమను పరిశీలించిన అనంతరం ప్రమాదం జరిగిన స్థలంతో పాటు ఇంత మంది మరణానికి గల కారణాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మొత్తం 44 మంది మరణించారు. ఇంత పెద్ద దుర్ఘటన ఫార్మా పరిశ్రమ చరిత్రలోనే లేకపోవడంతో షనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం కూడా రంగంలోకి దిగింది. రసాయన పరిశ్రమలను ఎలా నిర్వహణ చేస్తున్నారో అక్కడ పనిచేసిన అధికారులను అడిగి తెలుసుకుంది. వారిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇప్పటికే మరణించిన కార్మికుల కుటుంబాలు పాత కాలం మిషనరీని వాడుతున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా కూడా విచారణ చేపట్టింది. రసాయన పరిశ్రమల్లో ఎప్పటి కప్పుడు యంత్ర సామగ్రిని ఆధునికీకరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయిందని ప్రాధమికంగా అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రమాదానికి రియాక్టర్ పేలడమే కారణమని తొలుత భావించినా మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో కూడా షనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం దర్యాప్తు చేసింది. అధికారులను విచారించిన మీదట సిగాచీ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించినట్లు .అధికారులు కూడా సక్రమంగా సమాధానాలు ఇవ్వకపోవడంతో వారికి ఉన్న అవగాహనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన నివేదికను షనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనుంది. ఇప్పటికే పరిశ్రమను మూడు నెలల పాటు మూసివేయడంతో మళ్లీ ప్రారంభిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా సూచించే అవకాశాలున్నాయి. ఇక సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో ఏడుగురు జాడ ఇంత వరకూ తెలియలేదు. శిధిలాల్లో లభ్యమైన మానవ శరీర భాగాలతో కుటుంబ సభ్యుల రక్తనమూనాలతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించినప్పటికీ సరిపోలక పోవడంతో ఆ ఏడుగురు జాడ కోసం మాత్రం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది.