YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వేమిరెడ్డికి కలిసి రాని రాజకీయాలు

వేమిరెడ్డికి కలిసి రాని రాజకీయాలు

నెల్లూరు, జూలై 10, 
నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు జిల్లాల్లో అనేక గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడమే కాకుండా ఆరోగ్యం విషయంలో కూడా ప్రజలకు అండగా నిలిచే కుటుంబంగా పేరు తెచ్చుకుంది. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు, చేసిన పనులు ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే బద్నాం అవుతుంది. రాజకీయాల్లోకి వస్తే అంతే. ఎంత సేవ చేసినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేమిరెడ్డి కాదు.. ఎంతటి వారికైనా విమర్శలు తప్పవు.అలాంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు నెల్లూరు జిల్లాకు మాత్రమే వీరు సుపరిచితం. ఆర్థికంగా బలమైన కుటుంబం కావడం, చేయి చాచిన వారికి లేదనకుండా గుప్త దానాలు చేయడం వేమిరెడ్డి కుటుంబానికి అలవాటు. అలాంటిది సహజంగానే డబ్బు ఎక్కువై, సేవా నిరతితో జనానికి దగ్గర కావడంతో రాజకీయాల్లోకి రావాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకాంక్ష తొలుత వైసీపీ నెరవేర్చింది. ఆర్థికంగా బలవంతుడైన, సామాజికవర్గంగా శక్తివంతుడైన వేమిరెడ్డిని తొలుత వైసీపీ గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా చేసింది. అయితే 2024 ఎన్నికలకు ముందుకు వేమిరెడ్డికి రాజకీయాలపై మరింత మక్కువ పెరిగింది.నెల్లూరు జిల్లాపై తన దైన ముద్ర ఉండాలని, తాను శాసించాలని భావించారు. అందుకే కొన్ని సీట్లు ఆశించారు. కానీ జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లారు. నిజానికి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బలమైన నేత టీడీపీ నేత ఎవరూ లేరు. నెల్లూరు జిల్లా వైసీపీికి కంచుకోట కావడంతో ఆ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవడం కష్టంగా మారింది. 2024 ఎన్నికలకు ముందు వరకూ నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పార్టీ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. తాను మరోసారి సర్వేపల్లి నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పడంతో పార్లమెంటు అభ్యర్థి కోసం టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి రాక పార్టీకి ప్లస్ అయింది.టీడీపీలోకి వస్తూనే తాను నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడిగా పోటీ చేశారు. వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేశారు. నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సూపర్ విక్టరీని సాధించింది. ఇద్దరూ గెలిచారు. అప్పటి నుంచి వేమిరెడ్డి కుటుంబంపై వివాదాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకూ తమ పని తాము చేసుకుంటూ వెళ్లే కుటుంబం వీధిలోకి రావడానికి రాజకీయాలే కారణమన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఉంటే ప్రత్యర్థులు వ్యక్తిగత దూషణలకు కూడా వెనుకాడరు. రాజకీయాలు ఒక బురద అని తెలిసి కూడా అందులో కాలు మోపడమే వేమిరెడ్డి కుటుంబం చేసిన తప్పులా కనిపిస్తుంది. మరి ఆ బురదను కడుక్కోవాలే తప్ప మరేమీ చేయలేని పరిస్థితి ఎవరికైనా ఉంటుంది.

Related Posts