
తిరుపతి జూలై 10,
వైసీపీ అధినేత జగన్ పర్యటనలు అంటేనే టెన్షన్ మధ్య సాగుతున్నాయి. నిజానికి ఇది కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు స్థానిక పోలీసులకు కూడా తలనొప్పిగా తయారయింది. జగన్ జిల్లాలకు వస్తున్నారంటే పోలీసులతో పాటు సిబ్బంది కూడా భయపడిపోతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని హెచ్చరికలుచేసినా బేఖాతరు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ వివిధ వర్గాల సమస్యలపై జిల్లాలను పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనలు వరసగా వివాదం అవుతుండటం, ఏదో ఒక అనుకోని ఘటనలు జరుగుతుండటంతో శాంతిభద్రతల సమస్యగా మారుతుంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన నష్టం రిగిపోతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి సమస్యలను అడ్రస్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అధికారంలో ఉన్నప్పుడు కనపడని సమస్యలు అధికారం లేనప్పుడు కనిపిస్తాయి. అది చంద్రబాబుకు అయినా.. జగన్ కు అయినా అంతే. కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ప్రతిపక్ష నేతలు అక్కడకు వెళ్లి పరామర్శించి తాము ఉన్నామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజానికి ప్రతిపక్ష నేతలు ఎవరు ఎన్ని పర్యటనలు చేసినా ఆ సమస్యలు పరిష్కారం కావు. అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే సమస్యలను పరిష్కరించేందుకు అవకాశముంటుంది. అది గిట్టుబాటు ధరలైనా? మరొకటైనా పవర్ లో ఉన్న పార్టీ స్పందిస్తేనే అనుకూలమైన నిర్ణయం వస్తుంది అది తెలిసినా ప్రజలు మాత్రం ప్రతిపక్ష నేతలు తమ వద్దకు వస్తే బాహ్య ప్రపంచానికి తెలుస్తుందని నమ్ముతారు. ఉదాహరణకు మిర్చి రైతుల సమస్యలపై గిట్టుబాటు ధరలు రావడం లేదని జగన్ గుంటూరు పర్యటనలు చేశారు. తర్వాత కొంత అధికార పార్టీలో హడావిడి కనిపించింది. ఆ సమస్య మళ్లీ ఇక కనిపించలేదు. ఇక పొగాకు కు మద్దతు ధర కల్పించాలంటూ రైతులు ఇబ్బందులు పడుతుండటంతో జగన్ పొదిల పర్యటన చేపట్టారు. తర్వాత కేంద్ర మంత్రి వచ్చి పొగాకు బోర్డును సందర్శించి వెళ్లారు. తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిందో లేదో తెలియదు. ఇప్పుడు జగన్ బంగారు పాళ్యం పర్యటనలోనూ మామిడి రైతులు పరామర్శించారు. అయితే ఇది కూడా నాలుగు రోజుల తర్వాత అంతే. కానీ జగన్ పర్యటనల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. పొదిలి పర్యటనలో టీడీపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో ఒక వ్యక్తి మరణించడం కలకలం రేపింది. దీనిపై జగన్ తో పాటు పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈరోజు తాజాగా బంగారుపాళ్యం ఘటనలో కార్యకర్తలు పోలీసుల లాఠీఛార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. జగన్ పర్యటనలు కొన్ని రోజుల ముందు హైటెన్షన్ మధ్య కొనసాగుతుండటంతో పోలీసులకు తలనొప్పిగా తయారయ్యాయి. అలాగని పర్యటనలకు అడ్డు చెప్పలేరు. నిబంధనలు పెట్టినా అమలు కావు. మరి మరో నాలుగేళ్లు ఇలాగే కొనసాగాల్సిందేనా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
జగన్ ది విధ్వంస యాత్రే : అచ్చెన్నాయుడు
జగన్ పర్యటన సినిమాసెట్టింగ్ మాదిరిగాఉందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ లేని సమస్యను సృష్టించేందుకు జగన్ పర్యటనలు చేస్తున్నారన్నారు. అన్నమయ్య జిల్లాల్లో 99 శాతం మామిడి కొనుగోళ్లు పూర్తయ్యాయన్న అచ్చెన్నాయుడు పరిష్కారం కోసం కాదు..ప్రచారం కోసమే వాళ్ల ఆరాటమని, జనసమీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ జనాలను తీసుకొస్తున్నారని అన్నారు. ఆరు కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్‌కు అనుమతి కావాలన్నారని, వంద మీటర్ల దూరంలో అనుమతి ఇస్తామంటే ఒప్పుకోరని తెలిపారు. హెలిప్యాడ్ దగ్గరకు వచ్చి విధ్వంసం చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. క్రిమినల్ ఆలోచనలు, సెట్టింగ్‌లతోనే ఇలాంటి కార్యక్రమాలు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతకు చెందిన పొలంలో పండిన మామిడి పండ్లను తెచ్చి రోడ్లపైకి పోసి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు నటించారని, జగన్ విపక్షంలో ఉండి కూడా విధ్వంసాన్ని సృష్టించేలా ప్రవర్తిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ప్రతి చోట బలప్రదర్శనే
సత్యసాయి, పల్నాడు జిల్లాల్లో ఎదురైన పరిణామాలు దృష్ట్యా చిత్తూరు పోలీసులు ముందుగానే ఆంక్షలు విధించారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనలో అపశృతులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సింగయ్య అనే వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోయాడు. మరో ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మూలంగా చనిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి నేరుగా వారిని పరామర్శించేందుకు బయలుదేరారు. అయితే సీజన్ దాటిన తర్వాత పరామర్శ ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది. కేవలం ఇది రాజకీయ కోణంలో చేస్తున్న పర్యటనగా మిగతా రాజకీయ పక్షాలు అభివర్ణిస్తున్నాయి. కానీ జగన్ ఇవేవీ పట్టించుకోలేదు.మరోవైపు నిన్ననే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జగన్ పర్యటనలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అలా నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. కానీ కనీస స్థాయిలో కూడా వైసిపి నేతలు దీనిని పట్టించుకోలేదు. భారీగా జన సమీకరణ చేశారు. అడుగడుగునా ఆంక్షలు అధిగమించారు. బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డులో 500 మందికి మించి ఉండకూడదని పోలీసులు తేల్చి చెప్పారు. కానీ వేలాది మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుగానే మార్కెట్ యార్డులోకి చొచ్చుకొచ్చాయి. మరోవైపు భారీగా జన సమీకరణ నడుమ కాన్వాయ్ నడుస్తుండగా.. విజయానంద రెడ్డి అనే వైసీపీ నేత కింద పడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఎదురయింది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.