
జైపూర్, జూలై 10,
రాజస్థాన్‌లోని సీకార్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె నేతాజీ మీరు ఎంజాయ్ చేయండి… మేమూ మీతోనే ఉన్నాం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. బ్యాగ్ పట్టుకొని నీటిలో నడుస్తూ.. తన గ్రామ అభివృద్ధిపై అసహనం వ్యక్తం చేసింది. చెత్త రహదారులు, తాగునీటి కష్టాలు, విద్యుత్ అంతరాయం, పాఠశాలల్లో లోపాలు వంటి పలు కీలక సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించింది. రాజస్థాన్‌లోని సికార్ జిల్లా లక్ష్మణ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గడోడా గ్రామంలో వర్షం తర్వాత నీరు నిలిచిపోవడంతో గ్రామస్తుల పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. ఈ సమస్యను హైలైట్ చేసే వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. దీనిలో గ్రామంలోని పాఠశాల విద్యార్థిని శివాని వరద నీటిలో వెళ్తూ స్థానిక నాయకులపై విమర్శలు గుప్పించింది. ఈ గ్రామం రాజస్థాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌గఢ్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోవింద్ సింగ్ దోతసార నియోజకవర్గంలో ఉంది. వీడియోలో శివాని గ్రామం దయనీయ పరిస్థితిని వివరించింది. నాయకుల అభివృద్ధి వాగ్దానాలు, తప్పుడు వాదనలను బహిర్గతం చేసింది.శివాని తన వీడియోలో గ్రామం దయనీయ పరిస్థితిని వివరిస్తూ, ఇది మాకు వాగ్దానం చేసిన అభివృద్ధి అని చెప్పింది. కొద్దిపాటి వర్షానికే మా గ్రామం నదిగా మారుతుందంటూ నాయకుల నిర్లక్ష్యంపై శివాని వ్యంగ్య స్వరంలో ప్రశ్నలు లేవనెత్తింది.