
న్యూ డిల్లీ జూలై 10
యూరప్‌లోని అత్యున్నత మానవ హక్కుల కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం MH17ను కూల్చింది రష్యా నే అని పేర్కొంది. అంతేకాదు ఉక్రెయిన్‌లో దశాబ్ద కాలంగా మాస్కో దురాగతాలకు పాల్పడిందని ఆరోపిస్తూ కీవ్, నెదర్లాండ్స్ దాఖలు చేసిన మరో మూడు కేసుల్లో యూరోపియన్ మానవ హక్కుల కోర్టు రష్యాకు వ్యతిరేకంగా తీర్పులు వెలువరించింది.2014, జులై 17న ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ MH17ను ఉక్రెయిన్ భూభాగం పైనుంచి రష్యా క్షిపణిని వినియోగించి మాస్కో అనుకూల తిరుగుబాటుదారులు కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 283 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రష్యా నిర్మిత బక్ క్షిపణితో ఈ దాడి జరిగిందని తేల్చింది. ‘ఉద్దేశపూర్వకంగానే విమానంపై దాడి చేశారని, బహుశా అది సైనిక విమానంగా భావించి ఉండొచ్చని ఆధారాలు సూచిస్తున్నాయి’ అని స్ట్రాస్‌బర్గ్ కోర్టు తెలిపింది. ఈ ఘటనపై తన ప్రమేయాన్ని రష్యా నిరాకరించడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని మాస్కో సరిగ్గా దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతేకాదు, ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. వేలాది మంది పౌరుల మరణానికి కారణమవడమే కాకుండా, ఉక్రెయిన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు అత్యాచారాన్ని ఒక యుద్ధ ఆయుధంగా వాడుకుందని ఆక్షేపించింది. హింస, పౌర మౌలిక సదుపాయాల ధ్వంసం, ఉక్రేనియన్ పిల్లలను అపహరించడం వంటి నేరాలకు పాల్పడిందని కోర్టు నిర్ధరించింది. ‘రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లో అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించాయి. వేలాది మంది పౌరులను చంపి గాయపరిచాయి. భయాందోళనలను సృష్టించాయి’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇక కోర్టు తీర్పుపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ తీర్పును తాము పాటించబోమని, దానికి ఎలాంటి విలువ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కొట్టిపారేశారు. మరోవైపు, ఉక్రెయిన్ ఈ తీర్పును చారిత్రక, అపూర్వ విజయంగా అభివర్ణించింది.