
న్యూ డిల్లీ జూలై 10
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పరిశోధనల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా అంతరిక్షంలో శుభాన్షు రైతు అవతారమెత్తారు మెంతి పెసర విత్తనాలు వేసి పెంచుతున్నారు. చిన్నపాటి గాజు పాత్రల్లో వాటిని పెంచుతున్నారు.జీరో గ్రావిటీ వాతావరణంలో ఈ మొక్కల పెరుగుదల ఎలా ఉంటుందోనన్న దానిపై ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లోని ప్రత్యేక స్టోరేజీ ఫ్రీజర్‌లో వాటిని ఉంచి అవి మొలకెత్తే విధానాన్ని ఫొటోలు తీశారు. ఈ పరిశోధనలో ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రవికుమార్ హోసమణి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు శుక్లాకు సహకరిస్తున్నారు. యాత్ర ముగించుకుని భూమికి తిరిగి వచ్చాక.. ఈ మొలకల్లోని జన్యు మార్పులు, పోషక విలువలను విశ్లేషించనున్నట్లు యాక్సియం స్పేస్ సంస్థ తెలియజేసింది. వ్యవసాయ ప్రయోగాలతో పాటు శుభాన్షు శుక్లా మరిన్ని కీలక పరిశోధనలు కూడా చేస్తున్నారు.
శాస్త్రీయ ప్రయోగాలపై ఉత్సాహం..!
అంతరిక్షంలో జరుగుతున్న శాస్త్రీయ ప్రయోగాలపై శుభాన్షు ఉత్సాహంతో ఉన్నారు. భారతదేశం చేపడుతున్న ప్రయోగాలపై ఆయన ప్రత్యేక ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆక్సియం స్పేస్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ లూసీ లోవ్ బుధవారం ఆక్సియం-4 మిషన్‌లోని సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా తాను చేస్తున్న శాస్త్రీయ ప్రయోగాల గురించి సమాచారం అందించారు. తాను చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా ఉన్నామని.. అంతరిక్ష కేంద్రంలో చాలా ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల ఇస్రో సహకారంతో పనిచేస్తోందని.. ఈ విషయంలో తాను చాలా గర్వపడుతున్నానన్నారు.