
విజయవాడ, జూలై 11,
వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షు జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత పేర్ని నాని కూడా ఇదే ప్రకటన చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో రెండేళ్ల తర్వాత వైయస్ జగన్ పాదయాత్ర స్టార్ట్ అవుతుందిని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి జగన్ గారు వస్తారు.. మీతో మాట్లాడతారని పేర్ని నాని తెలిపారు ప్లీనరీ తర్వాత జిల్లా మీటింగ్స్.. ఆ తర్వాత పాదయాత్ర ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలతో నేరుగా సంబంధం బలోపేతం చేయడం, యువతను సమీకరించడానికి జగన్ పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. జగన్ ఈ పాదయాత్రను 2029 ఎన్నికలకు ముందు పార్టీని పునరుద్ధరించేందుకు ఒక వ్యూహంగా ఖరారు చేసుకున్నారు. ఈ పాదయాత్ర జిల్లా స్థాయి సమావేశాలు , ప్లీనరీ సమావేశం తర్వాత ప్రారంభమవుతుందని ఇప్పటికే ప్రకటించారు. గతంలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2017 నుంచి 2019 వరకు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 341 రోజులలో 134 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగింది. ఈ సారి పాదయాత్ర కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయిలో ప్రజలతో మాట్లాడుతూ సాగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాదయాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తుందని, ప్రత్యేకించి రైతులు, మహిళలు, యువత, మరియు వెనుకబడిన వర్గాల సమస్యలపై దృష్టి సారిస్తుందని జగన్ చెబుతున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో YSRCP 151 నుండి 11 సీట్లకు పడిపోయింది. జగన్ తన పార్టీని పునరుద్ధరించేందుకు ఈ పాదయాత్ర మాత్రమే మార్గంగా భావిస్తున్నారు. పాదయాత్రకు ముందు, జగన్ జిల్లా స్థాయి పర్యటనలు చేపడతారు. ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం ద్వారా 2014లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రతి ఎన్నికకు ముందు ప్రతిపక్ష నేతలు పాదయాత్ర చేయడం కామన్‌గా వస్తోంది. 2009లో చంద్రబాబు పాదయాత్ర చేయ లేదు కానీ.. బస్సు యాత్ర చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేకపోయింది. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డికి బదులుగా ఆయన సోదరి షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాదయాత్ర చేశారు. కానీ టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల కోసం జగన్ పాదయాత్ర చేశారు. ఆయన ఘన విజయం సాధించారు. మళ్లీ 2024 ఎన్నికల కోసం టీడీపీ కోసం నారా లోకేష్ పాదయాత్ర చేశారు. టీడీపీ ఘన విజయం సాధించింది. అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ.. రెండేళ్ల పాటు పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.