
రాజమండ్రి, జూలై 11,
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి చాలా పట్టుంది అంటుంటారు. నాయకత్వపరంగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలమైన నాయకులు ఉండడం, సీనియర్లు ఉండడం కూడా కలిసొచ్చే అంశం. అయితే ఈ బలమైన నాయకుల్లో ఇప్పుడు సఖ్యత కొరవడి పార్టీ కార్యక్రమాల్లోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితికి వచ్చారట. రాజమండ్రి నుంచి అమలాపురం వరకు ఇదే వరుస అంటున్నారు పరిశీలకులు. పైకి ఒకే వేదికపై కలిసికట్టుగా కూర్చున్నప్పటికీ ఒకరిని చూస్తే మరొకరికి విపరీతమైన చిరాకు కలుగుతోందని అంటున్నారు. ఆ కొద్ది సమయం ఓపిక పడుతున్నారట. ఇలా పార్టీలో ముఖ్య నాయకత్వం నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం వరకు ఇదే తంతు అంటూ పార్టీలోనే అసహనం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇలా అయితే ఎలా? పార్టీలోనే సఖ్యత లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలా నెగ్గుకురాగలుగుతాం.? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట..ఒకప్పటి కాంగ్రెస్ పార్టీలో రాజమండ్రి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది జక్కంపూడి రామ్మోహనరావు ఫ్యామిలీనే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు అంతటి ప్రాధాన్యతనిచ్చారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి, కుమారుడు రాజా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆ తరువాత వైసీపీలో వచ్చిన జక్కంపూడి కుటుంబం జగన్‌కు అత్యంత సన్నిహితులుగా మారారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వైసీపీలోకి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చిన మార్గాని భరత్ పార్టీలోకి వచ్చిందే తడవుగా రాజమండ్రి ఎంపీ సీటు దక్కించుకున్నారు. వైసీపీ గాలిలో ఎంపీగా గెలవడం జరిగిపోయింది. రాజకీయ సమీకరణాలతో జక్కంపూడి రాజాను రాజమండ్రి పక్కనే ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గానికి పంపించారు. రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడంతో ఎంపీగా గెలిచిన మార్గాని భరత్‌కు కలిసొచ్చింది.రాజమండ్రిలో అధికార పార్టీ తరపున ఒక్క ఎంపీ భరత్ ఉండడంతో తిరుగులేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఒకప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తన అనుచరులకు అన్యాయం జరుగుతుందంటూ జక్కంపూడి రాజా, అతని సోదరుడు గణేష్ ఆరోపించడం, భరత్, జక్కంపూడి ఫ్యామిలీ మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ప్రెస్‌మీట్‌లు పెట్టుకుని మరీ ఆరోపణలు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం భరత్‌కు అప్పగించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఎన్నికల తరువాత కూడా ఒకే పార్టీలో ఉన్నా మార్గాని భరత్, జక్కంపూడి రాజా సోదరుల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మార్గాని భరత్‌పై జక్కంపూడి రాజా, అతని సోదరుడు గణేష్ పలు ఆరోపణలు చేయడం, అదే సమయంలో భరత్ కూడా జక్కంపూడి సోదరులపై ప్రత్యారోపణలు చేయడం జరుగుతోంది. రాజమండ్రి తరహాలోనే అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోనూ వైసీపీలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇటీవల జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బోత్స సత్యనారాయణ కోసం ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలో మాజీ ఎంపీ చింతా అనురాధ ఫోటో వేయడంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిపై ఒక్కసారిగా ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్. ఆమెకు ఏ ప్రోటోకాల్ ఉందని ఫోటో వేశారని ప్రశ్నించారు. దీనికి ఆయన కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆమె మాజీ ఎంపీ గనుక వేశానని చెప్పారు. అయితే అక్కడున్న కొంతమంది సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కానీ అంతుర్యుద్ధం ఆగలేదు. ప్రస్తుతం మరింత ముదిరిందంటున్నారు.అమలాపురం పార్లమెంటు కన్వీనర్ బాధ్యతలు విశ్వరూప్‌కు అప్పగించింది అధిష్టానం. అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను ఆయన కుమారుడు శ్రీకాంత్‌కు అప్పగించింది. అయితే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన గనుక జరిగితే అమలాపురం అసెంబ్లీ సీటు జనరల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో వీరంతా అల్లవరం నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి ఉంటుంది. మాజీ ఎంపీ స్వస్థలం అల్లవరం కావడంతో విశ్వరూప్ కుటుంబానికి అనురాధ పోటీ అవుతుందన్న ఉద్దేశ్యంతోనే విశ్వరూప్ ఇలా వ్యవహరిస్తున్నారా..? అనురాధ కూడా అల్లవరం నియోజకవర్గంపై కన్నేసిన క్రమంలోనే వీరిద్ధరి మధ్య అగాధం నెలకొందా..? అన్న అనుమానం కోనసీమ ప్రాంతంలో ఉంది. మొత్తం మీద అటు రాజమండ్రి, ఇటు అమలాపురంలో మాత్రం వైసీపీ ముఖ్యనేతల్లో మాటల మంటలు అంటుకుని తారాస్థాయికి చేరుకుంటున్నాయి.