
ఒంగోలు, జూలై 11,
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అమలు కానుంది. గత ఎన్నికలకు ముందు ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పిస్తామని కూటమి పార్టీ నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఉచిత బస్సుకు ముహూర్తం ఖరారయింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితం చేయడంపై మహిళలు పెదవి విరుస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బస్సు సర్వీసుల్లో అమలు చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం జిల్లాలకే పరిమితం చేయడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.. గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కాదు. గత ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలుగా చేసింది. పది ఉమ్మడి జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చింది. ప్రస్తుతం అవే జిల్లాలు కొనసాగుతున్నాయి. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయాలంటే ఉమ్మడి జిల్లాలోని తమ వాళ్లు ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్లేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. జిల్లాలు కుదించడంతో విస్తీర్ణం కూడా తగ్గడంతో బస్సు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి కాని, ప్రభుత్వానికి కానీ పెద్దగా నష్టం ఉండదు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలోని అద్దంకి బాపట్ల జిల్లాలో ఉంది. కానీ అద్దంకి ప్రజలు ఎక్కువగా ఒంగోలు వస్తుంటారు. కానీ ఒంగోలుకు అద్దంకికి చెందిన మహిళలు రావాలంటే ఉచిత ప్రయాణం కుదరదు. అంటే ప్రభుత్వానికి కూడా పెద్దగా భారం అని పించదు. బస్సుల్లో కూడా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా రద్దీ ఉండదు. బస్సుల సంఖ్య పెద్దగా పెంచాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే పని ఉంటేనే మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తారు. ఒకవేళ జిల్లా దాటి ప్రయాణించాలంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆటో కార్మికుల నుంచికూడా ప్రభుత్వానికి అసంతృప్తి పెద్దగా ఎదురు కాదు. ఎక్కువగా జిల్లాల్లో గ్రామాల మధ్య ఎక్కువగా షేరింగ్ ఆటోలు తిరుగుతుంటాయి. కానీ జిల్లాలో అయితే పరవాలేదు. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆర్టీసీ బస్సు అయినా ఒకటే..ఆటో అయినా ఒకటేనన్న ధోరణి ఆటోమేటిక్ గా కనపడుతుంది. మొత్తం మీద ఉచిత బస్సు పెద్దగా భారం లేకుండా ప్రయాణం సాగిస్తుందని అనుకోవాలి.