YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల ప్రసాదంలో సిక్కోలు జీడిపప్పు

తిరుమల ప్రసాదంలో సిక్కోలు జీడిపప్పు

శ్రీకాకుళం, జూలై 11, 
శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పుకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు సాధించింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ( ఓటిఓపి ) పథకంలో భాగంగా ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో పలాస జీడిపప్పును వినియోగిస్తున్నారు. శుచి, శుభ్రతకు పెట్టింది పేరు. ఆపై ఎంతో రుచిగా ఉంటుంది ఇక్కడ జీడిపప్పు. అంతర్జాతీయంగా కూడా ఎగుమతి అవుతోంది. జాతీయస్థాయిలో ఇక్కడ జీడిపప్పుకు గిరాకీ. ఈ ఏడాది ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపికయింది పలాస జీడిపప్పు. దీంతో మరోసారి శ్రీకాకుళం జిల్లా జాతీయస్థాయిలో చర్చకు వచ్చింది. పలాస జీడిపప్పునకు దశాబ్దాల చరిత్ర. ఉద్దానం ప్రాంతంలో ప్రధానంగా పండే పంట జీడి. పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల్లో విస్తారంగా పండుతుంది జీడి. దాదాపు 24 వేల హెక్టార్లలో జీడి పంట సాగు చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం ఈ పంట సొంతం. తక్కువ పెట్టుబడుతూ ఎక్కువ లాభాలు సాధిస్తుంది జీడి. జీడి పంట సాగు, జీడి పరిశ్రమల నిర్వహణ ద్వారా దాదాపు 2 లక్షలకు పైగా కుటుంబాలు ఉపాధి పొందుతుంటాయి. అయితే దేశంలో మిగతా ప్రాంతాల కంటే పలాస జీడిపప్పులో నాణ్యత అధికం. అందుకే ఇక్కడి జీడిపప్పు వైపు మొగ్గుచూపింది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రసాదం తయారీలో ఇక్కడి జీడిపప్పును వినియోగిస్తోంది.
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ‘ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడి జీడిపప్పును ఎంపిక చేసింది. జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేంద్ర బృందం ఉద్దానం ప్రాంతంలో జీడి పంటను పరిశీలించింది. పరిశ్రమల వద్ద జీడిపప్పు నాణ్యతను గుర్తించింది. ఇక్కడి పంట విశిష్టతను గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రత్యేక బృందం నివేదికను సమర్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడి జీడిపప్పును జాతీయ ఉత్తమ అవార్డును కట్టబెట్టింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తో పాటు ఉద్యానవన శాఖ అధికారి ఈ ఉత్తమ అవార్డును స్వీకరించనున్నారు.విపత్తులతో పంటకు నష్టం ఉద్దానంలోజీడి సాగు దశాబ్దాలుగా వస్తోంది. ఇది పూర్తిగా వాణిజ్య పంట. స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పంట. కానీ ఏటా వస్తున్న విపత్తులు జీడి పంటకు అపార నష్టానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో వచ్చే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, తుఫాన్లు బంగాళాఖాతం నుంచి ప్రారంభం అవుతుంటాయి. 2018లో వచ్చిన తితలి తుఫాన్ జీడిపంటకు అపార నష్టానికి గురిచేసింది. పూర్తిగా పంటను నాశనం చేసింది. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మళ్లీ కొత్తగా రైతులు జీడి మొక్కలను నాటుకున్నారు. ఇప్పుడిప్పుడే జీడి పంట ఉత్పత్తి పెరుగుతోంది. ఈ దశలో టీటీడీ ఇక్కడి పప్పును గుర్తించింది. మరోవైపు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు రావడంతో.. దేశవ్యాప్తంగా పలాస జీడిపప్పు పేరు మార్మోగుతోంది. దీంతో దీనికి ఖండాంతర ఖ్యాతి దక్కుతుందని.. జీడీకి ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశిస్తున్నారు.

Related Posts