
అమరావతి, జూలై 14,
అమరావతి రెండో విడత భూ సేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? సీఎం చంద్రబాబు పునరాలోచనలో పడ్డారా? తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్ధపడ్డారా? క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారా? అమరావతి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూన్ 25న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అమరావతి భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా అమరావతి ప్రాంతంలో అదనపు భూముల సేకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే గతం మాదిరిగా అమరావతి రైతుల నుంచి అనుకున్న స్థాయిలో ఆసక్తి మాత్రం కనిపించలేదు. దీంతో తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రుల అభిప్రాయం మేరకు చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు ప్రచారం సాగుతోంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. అమరావతి యధా స్థానానికి వచ్చింది. అదే సమయంలో గత ఏడాదిగా నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ హామీతో ప్రపంచ బ్యాంకు తోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15 వేల కోట్ల రూపాయల రుణం అందింది. ఇతర మార్గాల్లో సైతం నిధుల సమీకరణ పూర్తయింది. దీంతో టెండర్లు ఖరారు అయ్యాయి. మరో రెండు నెలల్లో వేలాదిమంది ఇంజనీర్ల పర్యవేక్షణలో అహోరాత్రులు పనులు చేయించి అమరావతి నిర్మాణ పనులను కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే అంతర్జాతీయ నగరాల సరసన అమరావతిని చేర్చాలని చంద్రబాబు సర్కార్ గట్టి సంకల్పంతో ఉంది. అందుకే అదనంగా మరో 35 వేల ఎకరాల భూమిని సేకరించాలని భావించింది. అంతర్జాతీయ విమానాశ్రయం తో పాటు మరికొన్ని నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకుంది. ఓ పదివేల ఎకరాల భూమిని ప్రభుత్వం తన వద్ద ఉంచుకోవాలని చూసింది. అయితే ఇది మంచి ఆలోచన అయినా.. అమరావతి రైతుల్లో అనేక రకాల అనుమానాలు ప్రారంభం అయ్యాయి. గత ఐదేళ్ల వైసిపి విధ్వంసాన్ని గుర్తించుకొని.. లేనిపోని ఇబ్బందులు ఎందుకన్నది అమరావతి రైతుల అభిప్రాయం. చంద్రబాబు సమర్థతపై వారికి నమ్మకం ఉన్నా.. ఒకవేళ భవిష్యత్తులో అధికారం మారితే పరిస్థితి ఏంటన్న అనుమానం మాత్రం వారిని వెంటాడుతోంది. అందుకే వారంతా ఈ అదనపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు.తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు కొందరు మంత్రులు. అదనపు భూసేకరణకు అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. అదనపు భూసేకరణ పేరుతో లేనిపోని ఇబ్బందులు ఎందుకని అన్నారు. అమరావతి రాజధాని భూ సేకరణకు సంబంధించి మంత్రులు ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేయడాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు అమరావతి రాజధానిని వ్యతిరేకించిన వైసీపీ వర్గాలకు ఇది అవకాశం ఇచ్చినట్టు అవుతుందని కూడా చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. టిడిపి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ మాట్లాడిన సందర్భం కూడా ఇది తొలిసారి. దీనిపై చంద్రబాబు స్పందించారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసి అమరావతి రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుందామని చెప్పారు. అందుకే ఇప్పుడు అమరావతిలో అదనపు భూసేకరణకు సంబంధించి ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.