
విజయవాడ, జూలై 14,
గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ , టీడీపీ రెండు ఒకే రోజు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు పెట్టుకున్నాయి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో వైసీపీ విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేసింది. ఏడాది పాలన అయిన సందర్భంగా టీడీపీ కూడా తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో వైసీపీ కార్యక్రమానికి కొడాలి నాని వస్తారన్న ప్రచారం జరిగింది. రప్పా రప్పా నరుకుతామని పేర్ని నాని హెచ్చరించిన వీడియో వైరల్ అయిన సమయంలో.. ఆయన కూడా వస్తారని తెలియడంతో టీడీపీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున గుడివాడలో గుమికూడారు. అదే సమయంలో మాజీమంత్రి కొడాలి నాని, సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే...బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ..గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో ఫ్లీక్సీని ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు కూడా మోసం గ్యారంటీ ఫ్లెక్సీలు వేశారు. అయితే వాటిని టీడీపీ కార్యకర్తలు చింపేశారు. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో కొడాలి నాని సమావేశానికి రాలేదు. గుడివాడ వన్ టౌన్ పీఎస్ లో సంతకం చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు కొడాలి నాని. ముఖ్యమైన నాయకులు ఎవరూ రాకపోవడంతో.. ద్వితీయ శ్రేణి నేతలతోనే గుడివాడ నియోజకవర్గంలో సమావేశాన్ని పూర్తి చేశారు. రప్పా రప్పా మీతోనే మొదలు పెడుతామని.. కొడాలి నాని ముఖ్య అనుచరుడు మెరుగుమాల కాళీ సమావేశంలో హెచ్చరిచారు. అదే సమయంలో గుడివాడ పట్టణంలోని 19, 20, 23, 24వ వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా APSWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తో కలిసి కూటమి ప్రభుత్వం ఏడాదిలో అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలకు వివరించారు. వైసీపీ ముఖ్యనేతలెవరూ గుడివాడ రాకపోవడంతో.. ఉద్రిక్తలు ఘర్షణల వరకూ వెళ్లకుండా ఆగిపోయాయి.
వైరల్ గా మారిన నాని ఆడియో
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఏపీలో అల్లర్లకు తెరలేపాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. గుడివాడ వివాదంపై పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. గుడివాడ వివాదంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన మాటల్లో తెలుస్తోంది. గుడివాడ ఘటనను బీసీ మహిళపై జరిగిన దాడిగా చిత్రీకరించాలని, దాడి నారా లోకేశ్పైకి తోసేద్దామని ఆయన అన్నారు.‘గుడివాడలో జడ్పీ ఛైర్పర్సన్ కారుపై జరిగిన దాడి ఘటనను ఓ బీసీ మహిళపై దాడి అంటూ రాష్ట్రవ్యాప్తంగా మనవాళ్లందరితో కలిసి గోల చేయించాలి. బీసీ గౌడ మహిళ అని అందరూ బయటకొచ్చి చెప్పాలి. పైనుంచి లోకేశ్ చెప్పడంతో గుడివాడ తెదేపా ఎమ్మెల్యే, అతని అనుచరులు చేశారని ప్రచారం చేద్దాంజ మన వాళ్లందరికీ మన నాయకుడి(జగన్)తో చెప్పిస్తేనే అందరూ గట్టిగా చేస్తారు. మన నాయకుడు చెబితేనే వింటారు. రాష్ట్రవ్యాప్తంగా గట్టిగా కులం పేరుతో ఆందోళనలు చేద్దాం’ అని పేర్ని నాని మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా లీక్ అయ్యింది. కూటమి ప్రభుత్వానికి, వైకాపా మధ్య జరిగిన గొడవకు కులం రంగు పులిమి వివాదం చేయాలని నాని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియో కాల్ లీక్ అవడంతో.. ఇదీ పేర్ని నాని నిజ స్వరూపమని కూటమి నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కుయుక్తులు పన్నుతున్నారని ఫైర్ అవుతున్నారు. నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల్ని చంపాలని పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని గంటల్లోనే ఈ వీడియో కాల్ లీక్ అయ్యింది. అంతకుముందు ఆయన ఆయన తమ పార్టీ నేతలకు ప్రత్యర్థులను ఎలా చంపాలో హితబోద చేశారు. "చీకట్లో కన్ను కొట్టి చంపేయాలి .. ఉదయమే వెళ్లి ఏమీ తెలియనట్లుగా పరామర్శించాలని" సూచించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పేర్ని నాని గతంలో కూడా టీడీపీ నాయకులపై పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.