
తిరుపతి, జూలై 14,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2014 లో పార్టీ పెట్టినా పార్టీని విస్తరించకపోవడానికి కారణం ప్రధానమైనది నేతలు పార్టీని ఇబ్బందిపెడతారనే. అందుకే ఆయన అన్ని నియోజకవర్గాల్లో ఇబ్బడి ముబ్బడిగా నేతలకు ఇన్ ఛార్జి పదవి ఇచ్చేసి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించలేదు. పార్టీ బలపడకపోయినా పరవాలేదు కానీ, నేతల వల్ల పార్టీకి, తనకు వ్యక్తిగతంగా చెడ్డపేరు రాకూడదనే గత పదేళ్ల నుంచి ఆయన ఆచితూచి నేతల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. తనకు నమ్మకమైన నేతలను మాత్రమే నియమించారు. అదీ తనకు సంబంధించిన వారు, దగ్గరగా ఉన్న వారు సిఫార్సు చేసిన వారికి మాత్రమే పదవులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా జనసేన బలోపేతం పై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టడం లేదని, కనీసం ఇన్ ఛార్జులను కూడా నియమించడం లేదని, పదవులను అప్పగించడం లేదన్న విమర్శలను ఆయన పెద్దగా పట్టించుకోరు. లైట్ గానే తీసుకుంటారు. పార్టీ పదవి ఇచ్చిన తర్వాత నేతలు తనకు తెలియకుండా ఏదైనాఅవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నా, మరేదైనా కేసులో ఇరుక్కుంటే తన పరువు ప్రజల్లో దెబ్బతింటుందని, అందుకే తక్కువ స్థానాల్లో పోటీ చేసి అయినా పూర్తి స్థాయి విజయం సాధించి అధికారంలోకి రావాలని ఆయన తొలి నుంచి ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే గత ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా పొత్తును ప్రకటించి కేవలం 21 నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తామని ప్రకటించారు. అప్పుడు కూడా ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. 21 స్థానాలను తీసుకోవడమేంటని, జనసేన కారణంగానే కూటమి ఏర్పడిందని, అందువల్ల ఎక్కువ స్థానాలను తీసుకోవాలని పవన్ కల్యాణ్ పై పలువురు కామెంట్స్ చేసినా ఆయన పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే వారిపై నిఘా పెట్టడంతో పాటు వారి పనితీరును ఎప్పటికప్పడు గమనించవచ్చని, ఎక్కువ సంఖ్య అయ్యే కొద్దీ సమాచారం తెప్పించుకోవడం కూడా కష్టంగా మారుతుందని, టీడీపీ, వైసీపీలకు పోటీగా జనసేన కూడా తయారవ్వడం మినహా మరొకటి ఉండదని పవన్ కల్యాణ్ చంద్రబాబుపై పెద్దగా ఒత్తిడి తేకుండానే తనకు ఇచ్చిన సీట్లతోనే సరిపుచ్చుకుని వాటన్నింటిలో అభ్యర్థులను గెలిపించుకున్నారు- ఇక ఎమ్మెల్యేల సంగతి అలా ఉంచితే పార్టీ ఇన్ ఛార్జుల విషయంలోనూ చాలా ఆచితూచి వ్యవహరించేవారు. అలాంటిది శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి కోటా వినుత విషయంలో తప్పుడు సమాచారం అందించారని కొందరు నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వినుత హత్య కేసులో ఇరుక్కుని పార్టీ పరువును దిగజార్చారని, వైసీపీకి విమర్శించడానికి అవకాశాలు కల్పించినట్లయిందని కూడా పవన్ కల్యాణ్ నేతలపై మండి పడినట్లు తెలిసింది. ఇటువంటి వారికి పదవులు ఇచ్చి తప్పు చేశామని కూడా పవన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అందుకే పవన్ కల్యాణ్ ఇకపై పదవులు ఇచ్చే సమయంలోనూ ట్రాక్ రికార్డు చూసి మరీ ఇచ్చేందుకు మరింతగా అధ్యయనం చేయాలని నేతలకు సూచించినట్లు తెలిసింది.