
ఒంగోలు, జూలై 14,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు కొద్దిరోజులు విరామం ఇచ్చి నేతలతో సమావేశం అవ్వాలని కోరుతున్నారు. నేతలతో సమావేశమై ముందు గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయి విశ్లేషించడానికి సమయం వెచ్చించాలని నేతలు సయితం కోరుతున్నారు. గత ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు, తీసుకున్న నిర్ణయాలు వంటి వాటిపై గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందన్న దానిపై నేతల నుంచి విడివిడిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని కోరుతున్నారు. సమావేశాల్లో తాను చెప్పడమే కాకుండా, తాను చెప్పింది విని నేతలు వెళ్లే పనికి స్వస్తి చెప్పి వారికి మైకు ఇచ్చి మాట్లాడించగలిగితే చాలా వరకూ సమస్యలు పరిష్కారమవుతాయని సూచిస్తున్నారు పర్యటనలను సక్సెస్ అవుతున్నాయంటే? జగన్ జిల్లాల పర్యటనలు సక్సెస్ అవుతున్నాయంటే అందుకు నేతలు, కార్యకర్తలు కారణం. ఎందుకంటే ఆంక్షలు పెట్టినా నేతలు, కార్యకర్తలు భయపడకుండా రోడ్డుపైకి వస్తున్నారంటున్నారు. అంత ఉత్సాహంతో పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలు ఈసారి ఎన్నికలలో ఇచ్చే హామీలతో పాటు అధికారంలోకి వస్తే ఏం చేయాలన్న దానిపై జగన్ నుంచి క్లారిటీ వస్తే మరింత పార్టీకి హైప్ వస్తుందని చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ తీసుకు వచ్చి తప్పు చేశానని ఇంత వరకూ ఆయన అనలేదు.పైగా వాలంటీర్లను తొలగించడం అన్యాయమంటూ జగన్ అధికార టీడీపీ పై విమర్శలు చేస్తుండటంతో మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తెస్తారా? అన్న అనుమానం కార్యకర్తల్లో ఉంది.. వాలంటీర్లు తిరిగి వస్తే తాము పార్టీ కోసం కష్టపడినా ప్రయోజనం ఏముంటుందని పలువురు అప్పుడే ప్రశ్నిస్తున్నారు. అలాగే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా ప్రజల్లో భాగస్వామ్యులను చేయగలిగేలా జగన్ పనితీరు ఉండాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. తమ చేత పంపిణీ చేయిచండంతో పాటు ప్రజలకు తమను దగ్గరకు చేర్చడం వంటి పనులను చేయగలిగితేనే ఈసారి గెలిచినా తగిన గుర్తింపు ఉంటుందని, లేకపోతే 2019 తర్వాత పరిస్థితి తిరిగి పునరావృతమవుతుందని, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి పంపిణీ చేసినా చివరకు ఎన్నికల సమయానికి అది ఏమాత్రం పనిచేయదని కూడా చెబుతున్నార. కార్యకర్తలకు ఈసారి తాను అధికారంలోకి వస్తే పెద్దపీట వేస్తానని, ప్రాధాన్యత ఇస్తానని జగన్ పదే పదే పలు సమావేశాల్లో చెబుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అధికారంలోకి రాగానే తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కార్యకర్తలకు ఏం చేయగలరన్న దానిపై కూడా క్లారిటీ ఉండాలని క్యాడర్ అభిప్రాయపడుతుంది. ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ ను కూడా సరిగా చూసుకుంటేనే గెలుపు సాధ్యమవుతుందని, ఈ నాలుగేళ్లు కూడా తాను చెప్పిందే విని వెళ్లాలని కాకుండా, వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని దాని ప్రకారం ముందుకు వెళితే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చని, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. మరి జగన్ నేతల మాట వింటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.