
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతుబంధు జీవిత భీమ పథకం అమలుపై క్షేత్రస్థాయిలో సమీక్షకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి జిల్లాలలో పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశంతో జూన్ 18 (సోమవారం) నుండి మూడు రోజులు హెలికాప్టర్ లో పర్యటించనున్నారు. మంత్రి తో పాటు రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పాల్గొంటారు. ప్రతి రోజు రెండు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఈ అవగాహన సమావేశాలను నిర్వహిస్తారు. జూన్ 18 (సోమవారం): కరీంనగర్ (11 AM), అదిలాబాద్ (2PM), జూన్ 19 మంగళవారం): ఖమ్మం (11AM), హన్మకొండ (2PM ), జూన్ 20 (బుధవారం): బహబూబ్ నగర్ (11AM), నల్గొండ (2PM) లో వారు పర్యటిస్తారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ రైతు సమన్వయ సమితి సమన్వయకర్త, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొంటారు. అదేవిదంగా జిల్లా మంత్రులు, , పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యలు, ఎమ్మెల్సీలు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ సమావేశంలో రైతుబంధు జీవిత భీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహనను కల్పించనున్నారు. రైతుల నుండి ఏవిదంగా వివరాలు సేకరించాలి, నామిని పేరును సేకరించడం, పత్రాలను కేంద్ర కార్యాలయాలకు పంపడంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలను సూచిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సమన్వయంతో పనిచేసి త్వరితంగా వివరాలను సేకరించి భీమా పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపడానికి అవసరమైన సూచనలను సమావేశంలో అందిస్తారు. తెలంగాణ లోని ప్రతి రైతు కుటుంబానికి దీమా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో రైతుకు బీమ పథకాన్ని ప్రవేశపెట్టారు. 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి రైతుకు అయ్యే రూ. 2,271 ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దురదృష్టవశాత్తు రైతు ఏ కారణం చేతనైనా (సహజ మరణమైనా) మరణిస్తే ఆ కుటుంబానికి పది రోజులలోనే రూ. 5 లక్షల పరిహారం అందుతుంది. ఈ పథకం అమలుకు భారత ప్రభుత్వ సంస్థ, ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్సురెన్స్ కంపెనీ ఎల్ ఐసీ తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది.