
విజయవాడ, జూలై 15,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పెద్ద భారం ఉంది. చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకానికి ఈ టర్మ్ అసలైన సమయమని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. 1995 నుంచి 2004 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి పదవిని నిలుపుకోగలిగారు. తనకు తానే ముఖ్యమంత్రిని కానని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ప్రకటించుకున్నారు. ఇక ఆకస్మిక తనిఖీల పేరుతో అధికారులను హడలెత్తించారు. చంద్రబాబుకు గ్లామర్ లేదు. కానీ తన రాజకీయ చాణక్యంతో పలు మార్లు ఒంటిచేత్తో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నా కార్యకర్తలను, నందమూరి కుటుంబ సభ్యలను ఒప్పించి మెప్పించగలిగారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. ఆయనను ప్రజలు ఎంచుకున్నది కూడా ఆయన నాయకత్వం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకమే. అందుకే ప్రజలు గెలిపించారు. 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పటికీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. అందుకు తగిన సమయం లేదని ఆయన చెప్పిన కారణాన్ని జనం నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి రాజధానిని అమరావతికి తరలించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసినా అనేక కారణాలతో జాప్యం జరగడంతో ప్రజలు కూడా చంద్రబాబు చెప్పిన మాటలను విశ్వసించారు. ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయితే చంద్రబాబు మార్క్ పాలన ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదన్న అభిప్రాయం ప్రజల్లో కనపడుతుంది. సంక్షేమ కార్యక్రమాలను ఆలస్యంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధి పనులను కూడా వేగంగా చేయకపోవడంతో కొంత భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరెన్నిక గన్న పరిశ్రమలు ఏపీకి రాలేదు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయినా అవి పూర్తవుతాయో లేదో తెలియడం లేదు. ఎందుకంటే సరైన వాతావరణ పరిస్థితులు కనిపించడం లేదు. దీనికి తోడు మళ్లీ అదనంగా ఇరవై వేల ఎకరాల భూమిని సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎవరూ హర్షించడం లేదు.. ఏడు పదులు దాటిన వయసులోనూ ఆయన ఇప్పటికీ కష్టపడుతున్నారు. కంపెనీలు రాక కోసం అనేక పర్యటనలు చేస్తున్నారు. ఢిల్లీకి వరసబెట్టి తిరుగుతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి సింగపూర్ పర్యటనకు కూడా వెళుతున్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఆయన ఐదు రోజుల పాటు సింగపూర్ లోనే ఉంటారు. రేపు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజులు అక్కడే ఉండి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజక్టులు, నిధులు గురించి ప్రయత్నం చేయడానికే ఢిల్లీకి వెళుతున్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి రాజధాని మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే పక్కా ప్రణాళికతో వెళుతున్నప్పటికీ అనుకోని అవాంతరాలు ఈసారి కూడా ఆయన అనుకున్నది నెరవేరుతుందా? లేదా? అన్న అనుమానం అందరిలోనూ ఉంది. మరి చంద్రబాబు ఈ గండం నుంచి ఎలా బయటపడతారన్నది చూడాలి.