
అమరావతి, జూలై 15,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీకి తొత్తుగా మారారంటూ వైసీపీ నేతలు విమర్శించవచ్చు గాక. కానీ ప్రజాసమస్యలను గుర్తించి వెంటనే స్పందిస్తారని మరోసారి రుజువయింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావడంతో పాటు వెనక్కు తగ్గినట్లు తెలిసింది. అందుకు కారణం పవన్ కల్యాణ్ మంత్రి వర్గ సమావేశంలోనే సున్నితంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారంటున్నారు. జనంనాడి పట్టి వెళ్లాలని, అలాగే ప్రత్యర్థుల చేతికి అనవసరంగా ఆరోపణలు చేసేందుకు అవకాశమివ్వకూడదన్న పవన్ అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఏకీభవించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమారావతికి మరో ముప్ఫయి వేల ఎకరాలు అదనంగా రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. తొలి దశలో ఇరవైవేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరించాలని నిర్ణయించారు. భూ సమీకరణ జరిపే గ్రామాల్లో గ్రామ సభలను కూడా అధికారులు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకూ సేకరించిన భూములకు సంబంధించి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదని, కొత్తగా మళ్లీ భూసమీకరణ ఏందంటూ రైతులు కొంత వ్యతిరేకించారు. తొలిదశలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన భూములకు ఇంకా రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వకుండానే మళ్లీ మొదలు పెడితే ఎలా అని గ్రామసభల్లో రైతులు అధికారులను సూటిగా ప్రశ్నించారు. తాము ఇవ్వబోమంటూ కొందరు పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. నిర్మొహమాటంగా చెప్పడంతో... అయితే ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ మంత్రి వర్గ సమావేశంలో నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలిసింది. తొలుత తీసుకున్న ముప్ఫయి ఏడు వేల ఎకరాలకు సంబంధించి భూమిని అభివృద్ధి చేయకుండానే మరోసారి ల్యాండ్ పూలింగ్ అంటూ వెళితే రైతుల్లో కూడా నమ్మకం కలగడం లేదని, తాము ఇప్పటికే తొలిదశలో భూములు ఇచ్చి పదేళ్లు దాటుతున్నా తాము కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, కనీసం తమకు ప్లాట్లు ఇస్తే వాటిని విక్రయించుకునైనా పిల్లల పెళ్లిళ్లు చేస్తామని ఆవేదన చెందారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా సేకరించాల్సిన భూమి విషయంలో పునరాలోచించుకుంటే మంచిదని సూచించారు. గతంలో కూడా హోం శాఖపై ఆయన చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నార... అదనపు భూసమీకరణపై విపక్షాల నుంచి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని, అది వైసీపీకి అడ్వాంటేజీగా మారే అవకాశముందని, ఆ అవకాశం ఇవ్వకూడదని పవన్ మంత్రివర్గ సమావేశంలోనే అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇందుకు నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, బలవంతపు భూ సమీకరణ చేయవద్దని కోరినట్లు తెలిసింది. దీనికి తోడు అదనపు భూ సమీకరణపై కనీసం మిత్ర పక్షాలతో మాట మాత్రమైనా చెప్పకుండా, కూటమిలోని మిగిలిన పార్టీల అభిప్రాయం తెలుసుకోకుండా మంత్రులు ప్రకటన చేయడాన్ని కూడా పవన్ తప్పుపట్టినట్లు తెలిసింది. దీంతోనే అదనపు భూ సమీకరణ విషయంలో కొన్నాళ్లు ఆగాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం మీద ఏడాది కాలంలో తొలిసారి ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశంలో పవన్ తప్పుపట్టినట్లయిందని జనసేన నేతలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
బాధ్యతగా నిర్వహిస్తా
గోవా గవర్నర్‌గా నియమించడం ఆనందంగా ఉందని అశోక్ గజపతి రాజు అన్నారు. పైడితల్లి అమ్మవారి దీవెనలు అనుకుంటున్నానని తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం లభించిందని అశోక్ గజపతి రాజు తెలిపారు. తాను గవర్నర్ గా నియమితులవుతానని ఊహించలేదని, కానీ తన పేరు ఖరారు కావడం ఆనందంగా ఉందని అశోక్ గజపతి రాజు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తన పేరును ప్రతిపాదించడం.. కేంద్రం ఆమోదించడం చాలా సంతోషంగా ఉందని అశోక్ గజపతి రాజు అన్నారు. మోదీ ప్రధాని కాకపోతే, చంద్రబాబు సీఎం కాకపోతే.. తనకు ఈ గవర్నర్ పదవి వచ్చేది కాదన్న ఆయన గోవా వేరీ ప్రోగ్రెసివ్ స్టేట్ అని గవర్నర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ధన్యవాదాలు తెలిపారు.