
విజయనగరం, జూలై 15,
మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు అనుకున్నట్లే గవర్నర్ పదవి లభించింది. దేశంలో మొత్తం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా రకవీందర్ గుప్తా, గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించారు. దీంతో మరో తెలుగు గవర్నర్ బండారు దత్తాత్రేయను మరో రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇంద్రసేనారెడ్డితో పాటు ఏపీకి చెందిన కంభంపాటి హరిబాబులు గవర్నర్ లుగా ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు గవర్నర్లకు మాత్రమే అవకాశం ఉందా? అన్న సందేహం కలుగుతుంది.పూసపాటి అశోక్ గజపతి రాజు అందరికీ సుపరిచితులే. గత ఎన్నికల్లో ఆయనకు విజయనగరం ఎంపీ టిక్కెట్ ఇవ్వకుండా ఆయన కుమార్తె ఆదితి గజపతి రాజుకు విజయనగరం ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినప్పుడే రాజుగారు గవర్నర్ అవుతారన్న ప్రచారం మొదలయింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది కాలం తర్వాత పూసపాటి అశోక్ గజపతి రాజు గవర్నర్ గా నియమితులైయ్యారు. పెద్దాయన అంటే పార్టీలో అందరికీ గౌరవమే. నీతికి నిజాయితీకి పేరు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అనేక సార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రిగా చేసినా ఎటువంటి ఆరోపణలు ఆయనపై రాలేదు. నిక్కచ్చిగా ఉండే నేతల్లో అశోక్ గజపతి రాజు ఒకరు.ప్రస్తుతమున్న రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని డిసైడ్ అయి తన వారసురాలిని పాలిటిక్స్ లోకి దించారు. అశోక్ గజపతి రాజు చంద్రబాబు నాయుడుతో సమానమైన రాజకీయ అనుభవం ఉన్న నేత. విజయనగరం జిల్లా అంటేనే టీడీపీలో మొదట గుర్తొచ్చేది ఆయన పేరే. అలాంటిది అశోక్ గజపతి రాజు ఎటువంటి పదవి లేకుండా ఏడాది నుంచి కోటలోనే పరిమితమవుతుండటం ఆయనను అభిమానించే వారికి మనస్తాపం కలిగించేదే. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ట్రస్ట్ విషయంలోనూ ఇబ్బంది పెట్టింది. న్యాయస్థానాలకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది.టీడీపీలో సీనియర్ నేతలను పక్కన పెట్టాల్సి రావడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంతో ఆయనకు గత ఎన్నికల్లో టిక్కెట్ నాయకత్వం ఇవ్వలేదు. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుండటంతో సీనియర్ నేత అయిన అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. పూసపాటి అశోక్ గజపతి రాజు కూడా తనకు రావాల్సిన సమయంలోనే వస్తుందని, అప్పటి వరకూ వెయిట్ చేయడమే తప్ప ఏం చేయలేమని గ్రహించిన రాజుగారు ఏడాది కాలం నుంచి మౌనంగానే ఉంటున్నారు. 1951లో జన్మించిన అశోగ్ గజపతిరాజు గ్వాలియర్ లోని సింధియా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. మంచి భావాలు కలిగిన నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు కేబినెట్ లో క్షత్రియ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కనప్పుడు కూడా పూసపాటి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఖాయమని అనుకున్నారు. ఈలోపు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణరాజును నియమించడంతో క్యాబినెట్ ర్యాంక్ కావడంతో ఇక అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గిరీ రాదేమోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ అందరి ఆలోచనలు పటాపంచలు చేస్తూ ఆయన గవర్నర్ గా నియమిస్తూ విజయనగరం జిల్లాాలోనే కాకుండా రాష్ట్రంలోని టీడీపీ అభిమానులందరూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.