
చెన్నై, జూలూ 15,
సాధారణంగా నల్లగా ఉండేవాళ్లను సినీ ఇండస్ట్రీలో చులకనగా చూస్తారు. వాళ్లను సినిమాల్లోకే తీసుకోరు. ఎన్నో ఏళ్లుగా నల్లగా ఉండే అమ్మాయిలు వర్ణ వివక్షకు గురవుతున్నారు. మోడలింగ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వివక్షపై ఓ యువతి గళమెత్తింది. నల్లగా ఉండడం మేం చేసినా తప్పా అని ప్రశ్నించింది. మోడలింగ్‌లో అడుగుపెట్టి ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ప్రతిభకు రంగు అడ్డు కాదని నిరూపించింది. కానీ ఆ గళమెత్తిన గొంతు మూగబోయింది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ మోడల్ శాన్ రేచల్. పుదుచ్చేరిలోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఈ 26 ఏళ్ల మోడల్ బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఆమె ఆర్థిక సమస్యల వల్లే మరణించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.శాన్ రేచల్ పెద్ద మొత్తం ట్యాబెట్లు తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను మొదట ప్రభుత్వాస్పత్రికి తరలించి, తరువాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. చికిత్స పొందుతూ మరణించింది. ఆర్థిక సమస్యల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోడలింగ్ ఈవెంట్లకు సంబంధించి తీవ్రంగా నష్టపోయినట్లు గుర్తించారు. ఇటీవలే తన నగలు తాకట్టు పెట్టి కొందరికి డబ్బులు చెల్లించినట్లు తెలిపారు. తన తండ్రిని ఆర్థికసాయం చేయాలని కోరినప్పటికీ.. తన వద్ద లేవని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.శాన్ రేచల్ అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె వివాహం చేసుకుంది. సున్నిత స్వభావాన్ని కలిగిన ఆమెకు.. వివాహ బంధంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరు కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు సమాచారం. మోడలింగ్‌లో రేచల్ ఎన్నో అవార్డులు సాధించింది. 2022లో మిస్ పుదుచ్చేరి టైటిల్‌ను గెలుచుకుని గుర్తింపు తెచ్చుకుంది. 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, 2022లో క్వీన్ ఆఫ్ మద్రాస్ వంటి టైటిళ్లను ఆమె అందుకుంది. మోడలింగ్, సినీ ఇండస్ట్రీలో నల్ల రంగు అమ్మాయిలు ఎదుర్కొంటున్న వివక్షను తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఎత్తి చూపింది. తరుచుగా ఈ అంశాలపై ఆమె మాట్లాడేది. చివరకు రేచల్ ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలిచివేసింది.