
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించే కానుకలను ఎప్పటికప్పుడు లెక్కింపు పూర్తి చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని నాణ్యేల పరకామణిని శనివారం ఉదయం తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులు శ్రీవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించే కానుకలలోని నాణేలు పేరుకుపోకుండా లెక్కింపు పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన అదనపు సిబ్బందిని, పరకామణి సేవకులను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. విదేశీ నాణేల విభజన, లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. పరకామణిలో ఎయిర్కండిషన్లు, ఫ్యాన్లు లను అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పరాకమణిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఇందులో భాగంగా అవసరమైన సిసి కెమరాలు ఏర్పాటు చేయాలని ఇన్చార్జ్ సివిఎస్వో శ్రీ శివకుమార్రెడ్డిని ఆదేశించారు. పరకామణి లెక్కింపు గదులలో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసేందుకు అవసరమైన షెడ్యూల్ రూపొందించి ఆ ప్రకారం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టిటిడి పరిపాలన భవనంలోని ఉద్యోగుల అన్నప్రసాదాల పంపిణీ కేంద్రాన్ని, నూతనంగా నిర్మిస్తున్న భవనంలోనికి మార్చిన అనంతరం ఆ భవనంలో పరకామణి విస్తరణకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని జెఈవో అధికారులకు సూచించారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి స్వదేశీ నాణేలు, విదేశీ నాణేల పరకామణిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ చంద్రశేఖర్రెడ్డి, ఎఫ్ఎ అండ్ సిఎవో బాలాజి, విజివో అశోక్కుమార్గౌడ్, పరకామణి డెప్యూటీ ఈవో దామోదరం, ఎస్ఇ (ఎలక్ట్రికల్) వేంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.