YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కుయ్యె..మొర్రో అంటున్న కెనడా, బ్రెజిల్

కుయ్యె..మొర్రో అంటున్న కెనడా, బ్రెజిల్

న్యూఢిల్లీ, జూలై 15, 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున‍్న విధానాలు ఇటు అమెరికన్లతోపాటు అటు ప్రపంచ దేశాలకు నచ్చడం లేదు. అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్‌.. తీసుకుంటన్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. వాణిజ్యం విషయంలో విధిస్తున్న టారిఫ్‌లతో ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతోంది. తమకు అనుకూలంగా లేని, తమ మాట వినని దేశాలపై ట్రంప్‌ భారీగా సుంకాలు విధిస్తున్నారు. తాజాగా బ్రెజిల్‌, కెనడాపై టారిఫ్‌ మోత మోగించాడు. కెనడాపై 35 శాతం సుంకం, ఇతర వాణిజ్య భాగస్వాములపై 15-20 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం కెనడాతో వాణిజ్య ఒత్తిడిని పెంచింది. ఇక బ్రిక్స్ సమావేశం, ప్రత్యేక కూటమి నేపథ్యంలో బ్రెజిల్‌పైనా 50 శాతం సుంకాలు విధించారు. దీంతో బ్రెజిల్‌లో అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 35 శాతం సుంకం విధించనున్నట్లు ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రకటించారు. ఇది ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సుంకం గతంలో విధించిన 25 శాతం సుంకం కంటే అధికం. కెనడా ప్రతీకార సుంకాలు విధిస్తే ఈ రేటు మరింత పెరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఫెంటనిల్ డ్రగ్ దిగుమతులను నియంత్రించడంలో కెనడా విఫలమైందని, అమెరికా వాణిజ్య లోటును పెంచే వాణిజ్య విధానాలను అనుసరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఈ సుంకం కెనడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. కెనడా ఎగుమతులలో 75 శాతం అమెరికాకు వెళ్తుంది. ట్రంప్ ఈ చర్య వాణిజ్య ఒప్పందాలను ఒత్తిడి చేయడానికి, ఫెంటనిల్ వంటి సమస్యలపై కెనడా నుంచి సహకారం రాబట్టడానికి ఒక వ్యూహంగా కనిపిస్తుంది.ఇక బ్రెజిల్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో సావో పాలోలోని పాలిస్టా అవెన్యూలో వేలాది మంది నిరసనకారులు ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ, నినాదాలతో ఆందోళనలు నిర్వహించారు. ట్రంప్ విధానాలను ప్రజల శత్రుత్వంగా అభివర్ణించిన నిరసనకారులు, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో విచారణకు సంబంధించి ట్రంప్ టారిఫ్‌లను రాజకీయ ఒత్తిడిగా భావిస్తున్నారు. 50 శాతం సుంకం బ్రెజిల్ ఎగుమతులను, ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయ ఉత్పత్తులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఈ నిరసనలు ట్రంప్ వాణిజ్య విధానాలు కేవలం ఆర్థిక చర్యలు మాత్రమే కాక, రాజకీయ ఒత్తిడి సాధనంగా కూడా పనిచేస్తున్నాయని భావిస్తున్నారు.కెనడా ఇప్పటికే అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను విధించింది. ట్రంప్ హెచ్చరికల ప్రకారం, కెనడా మరిన్ని సుంకాలు విధిస్తే, అమెరికా టారిఫ్‌లు మరింత పెరుగుతాయి. బ్రెజిల్ కూడా ప్రతీకార సుంకాలను పరిశీలిస్తోంది. ఇది గ్లోబల్ వాణిజ్యంలో అస్థిరతను పెంచనుంది. ఈ టారిఫ్‌లతో అమెరికా వినియోగదారులకు వస్తువుల ధరలు పెరగడం, ఆటోమొబైల్, ఉక్కు, అల్యూమినియం వంటి పరిశ్రమలపై ప్రభావం పడనుంది. ఇది వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని సృష్టిస్తుంది.

Related Posts