
అదిలాబాద్, జూలై 15,
బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. హిందుత్వ ఎజెండాతో ఆయన చేసే వ్యాఖ్యలు జాతీయ మీడియాలోనూ మారుమోగుతుంటాయి. ఇక అంతర్జాతీయ టెర్రరిస్టుల నుండి కూడా బెదిరింపులు వస్తున్నాయని రాజాసింగ్ పలుమార్లు చెప్పడం ఆయన ఇమేజ్‌కు నిదర్శనం. అలాంటి రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇటీవలే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించారు. ఈ క్రమంలో రాజాసింగ్ రాజకీయ అడుగులు ఎటువైపు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ఏదో పార్టీలో చేరకతప్పదు. రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గంలో పట్టున్న నేత. బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇది పార్టీ గుర్తింపుతో కాకుండా, నియోజకవర్గంలో ఆయనకున్న సొంత బలంగానే చూడాలి. రాజాసింగ్ 2009లో టీడీపీ నుండి జీహెచ్‌ఎంసీలోని మంగళ్‌హాట్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు. 2014 వరకు అదే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇలా పార్టీ ఏది మారినా తన హిందుత్వ సిద్ధాంతాలను మాత్రం వదులుకోలేదు. ఇదే రాజాసింగ్ బలంగా చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో చేరేది లేదని ఇప్పటికే రాజాసింగ్ తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇక బీజేపీలో ఉన్న అంతర్గత గొడవల కారణంగానే బయటకు వచ్చారు. ఇక మిగిలిన చిన్న పార్టీలు వామపక్షాలు, ఎం.ఐ.ఎంలు మాత్రమే. ఈ రెండు పార్టీలు తన హిందుత్వ సిద్ధాంతాలకు ప్రధాన శత్రువులు, కాబట్టి ఆ పార్టీలలో చేరే అవకాశమే లేదు. ఈ క్రమంలో రాజాసింగ్‌కు పార్టీల గుర్తింపు కాకుండా హిందుత్వవాదిగా మంచి గుర్తింపు ఉంది. తన సొంత బలంతో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇది రాజాసింగ్‌కు ఉన్న మొదటి ఆప్షన్.ఏ పార్టీలో చేరకుండా సొంత పార్టీ పెట్టడం. అయితే ఇది చాలా కష్టమైన పని. ఒక రాజకీయ పార్టీని పెట్టి దాన్ని నడపడం అనేది చాలా కష్టమైన విషయం. పార్టీ పెట్టాలంటే బలమైన సిద్ధాంతం, రాజకీయ వ్యూహం, రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వ శూన్యత, భారీగా నిధులు సేకరించడం, పటిష్టమైన క్యాడర్‌ను తయారు చేసుకోవడం - ఇవి ప్రస్తుత రాజకీయాల్లో సాధ్యమైన పనులు కావు. హిందుత్వ ఎజెండాతో పార్టీ పెట్టాలనుకున్నా, రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ఆ స్థానంలో ఉండనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో చిన్న పార్టీలు మనుగడ సాధించే పరిస్థితుల్లో లేవు. ఇది రెండో ఆప్షన్‌గా తీసుకోవాలనుకున్నా రాజాసింగ్ వంటి నేతకు చాలా కష్టమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు.బీజేపీలాగా హిందుత్వ సిద్ధాంతంతో నడుస్తున్న శివసేన వంటి జాతీయ పార్టీలో చేరడం మూడో ఆప్షన్. మహారాష్ట్ర పార్టీ అయినప్పటికీ హిందుత్వ వాదంతో ఉండి, బీజేపీకి దూరంగా ఉన్న పార్టీ కావడం వల్ల రాజాసింగ్ ఈ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో ఈ పార్టీ లేనప్పటికీ హిందుత్వ వాదంతో హైదరాబాద్ వంటి నగరంలో శివసేనను బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో కూడా ముంబైలోనే శివసేన పార్టీ బలంగా ఉన్న చరిత్ర ఉంది. ఆ తర్వాత క్రమక్రమంగా మహారాష్ట్ర అంతటా వ్యాపించి బలమైన పార్టీగా శివసేన రూపొందింది. ఈ పార్టీలో చేరడం ద్వారా రాజాసింగ్ తన హిందుత్వ భావజాలాన్ని దేశవ్యాప్తంగా వినిపించే అవకాశం లేకపోలేదు. రాజాసింగ్ వంటి నేతలు వస్తే శివసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అయ్యే అవకాశం లేకపోలేదు.అసంతృప్తితో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయడం, దాన్ని పార్టీ ఆమోదించడం చకాచకా జరిగిపోయాయి. అయితే గతంలోనూ రాజాసింగ్ పార్టీ లైన్ దాటి చేసిన పరుష వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత శాసనసభ ఎన్నికల ముందే తిరిగి పార్టీలోకి తీసుకుని గోషామహల్ టికెట్‌ను బీజేపీ రాజాసింగ్‌కు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రాజాసింగ్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి ఇదే కథ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కావచ్చు. తిరిగి బీజేపీలోనే ఎన్నికల ముందు చేరి గోషామహల్ నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే గోషామహల్‌లో రాజాసింగ్‌ను మించి బలమైన అభ్యర్థి బీజేపీకి దొరికే అవకాశం లేదనే చెప్పాలి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్న రాజకీయ నానుడి రాజాసింగ్ విషయంలో జరిగవచ్చు.రాజాసింగ్‌కు ఉన్న ఈ నాలుగు ఆప్షన్లలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన గోషామహల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తన సైద్ధాంతిక బలం, ఎమ్మెల్యేగా తనకున్న ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుని గోషామహల్‌లో బలమైన నేతగా ఉండటాన్నే రాజాసింగ్ తన ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. లేదనుకుంటే సైద్ధాంతిక సామీప్యత ఉన్న శివసేన పార్టీలో చేరి గోషామహల్‌లో ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీకి పోటీగా హిందుత్వ ఎజెండాను తీసుకెళ్లే శివసేనకు తెలంగాణలో రాజాసింగే నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన రెండు ఆప్షన్స్‌ను రాజాసింగ్ అమలు చేసే అవకాశాలు చాలా తక్కువ. పార్టీ పెట్టి నడిపించడం అంత తేలిక కాదు. అదే రీతిలో బీజేపీ నుండి విభేదించి మళ్లీ ఆ పార్టీలో చేరే అవకాశాలు తక్కువ. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు రాజకీయాల్లో చివరి రెండు ఆప్షన్స్‌ను రాజాసింగ్ తీసుకోరని మాత్రం చెప్పలేం. కానీ ఆ అవకాశాలు ప్రస్తుత పరిస్థితిని బట్టి తక్కువనే చెప్పాలి.