YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇబ్బందుల్లోనే చదువుసంధ్యలు

ఇబ్బందుల్లోనే చదువుసంధ్యలు

రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. పెద్ద ఎత్తునే నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ విద్యాలయాల్లో వసతుల మెరుగుదలకు కృషిచేస్తోంది. అయితే.. కొన్నిచోట్ల మాత్రం సమస్యలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ విషయానికొస్తే.. ప్రధానంగా ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల్లో సరైన వసతులు లేవని విద్యార్ధిసంఘం నేతలు అంటున్నారు. నాగర్ కర్నూల్ ల్లోనే కాదు ఉమ్మడి పాలమూరు అంతటా ఈ పాఠశాలల్లో వసతులు కొరవడ్డాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదర్శ పాఠశాలల్లో గతేడాదిలోనే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. అయితే పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా వసతులు కల్పించలేదని వినికిడి. ఇప్పటికీ వందమంది విద్యార్థినులకే వసతి కల్పిస్తున్నారు. మిగిలిన విద్యార్ధులంతా రోజూ ఇళ్ల నుంచే బడులకు వచ్చివెళ్తున్నారు. దీంతో విద్యార్ధులందరికీ వసతి సౌకర్యం కల్పించాలన్న డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది ఆదర్శ పాఠశాలల్లో గతేడాది ప్రతి సెక్షన్‌కు పదేసి సీట్లను పెంచారు. దీంతో ప్రతి పాఠశాలలో 180 మంది వరకు విద్యార్థులు ఎక్కువయ్యారు. ఈ ఏడాది కూడా పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో పెరిగిన విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలని విద్యార్ధిసంఘం నేతలు విజ్ఞప్తిచేస్తున్నారు.

 

పూర్తిస్థాయిలో వసతి కొరవడడం ఓ సమస్య అయితే మధ్యాహ్న భోజనం తయారీకి వంట గదుల్లేకపోవడం మరో ఇబ్బందిగా మారింది. పిల్లల కోసం వంటలు ఆరుబయటే వండుతున్నారు. మరోవైపు మూత్రశాలలు, మరుగుదొడ్లు తక్కువగా ఉన్నాయి. ఇక కస్తూర్బా విద్యాలయాల్లోనూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడి రెండొందల మంది విద్యార్థినులకు సరైన వసతులు లేవు. డార్మెటరీలో నాలుగు, ఆవరణలో అయిదు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి సరిపోవడం లేదు. తరగతి గదులూ తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్‌ మొదలు పెట్టడంతో ఇబ్బందులు మరింత తీవ్రం కానున్నాయన్న ఆందోళన నెలకొంది. కంప్యూటర్‌ గదిలోనే ల్యాబ్‌, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఉపాధ్యాయుల గదిని తొలగించినా తరగతి గదులకు కొరత ఏర్పడుతోంది. సైన్స్‌కు సంబంధించిన విద్యాలయాల్లో సమస్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడి విద్యార్ధులకు ప్రత్యేకంగా ల్యాబ్‌ గదులను ఏర్పాటు చేయాలి. ఇలా పలు రకాలుగా సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఇవన్నీ గుర్తించి ప్రభుత్వం అవసరమగు వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు అధిగమించేందుకే సమయం సరిపోదని అంతా అంటున్నారు. ఈ ఇబ్బందులపై స్పందించిన అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  

Related Posts